సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రోజురోజుకు పెరుగుతున్న క్యాన్సర్ బాధిత మహిళల్లో రొమ్ము క్యాన్సర్ బాధితులు మొదటి స్థానంలో నిలువగా, సర్వైకల్ క్యాన్సర్ బాధితులు 2వ స్థానంలో నిలిచారని అపోలో వైద్యనిపుణులు వెల్లడించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో భాగంగా సోమవారం బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌డెక్కన్‌లో అపోలో క్రెడిల్, చ్రిల్డన్స్ హాస్పిటల్, ఎంఎస్‌డి ఫార్మాస్యూటికల్స్ సంయుక్తంగా నిర్వహించిన ‘టుగెదర్ ఫర్ హర్ వెల్ బీయింగ్’ కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొని ప్రసంగించారు.
జూబ్లీ హిల్స్ అపోలో క్రెడిల్, చ్రిల్డన్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, గైనకాలజిస్టు డాక్టర్ మహితా రెడ్డి మాట్లాడుతూ భారత్‌లో 2022లో జరిపిన అధ్యయనం ప్రకారం 1.5 లక్షలకు పైగా కొత్త హెచ్‌పీవీ సంబంధిత క్యాన్సర్ కేసులు నమోదైనట్లు తెలిపారు. భారతీయ మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో నిలిచిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి మహిళ తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య పరీక్షలో భాగంగా గైనకాలజిస్టును కలవడం, హెచ్‌పీవీ వ్యాక్సిన్ వంటి టీకాల సమాచారం తెలుసుకోవడం, వ్యాధి నిరోధక చర్యలు పాటించడం ద్వారా మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
కొండాపూర్ అపోలో క్రెడిల్, చ్రిల్డన్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, గైనకాలజిస్టు డాక్టర్ పద్మిని శిల్ప మాట్లాడుతూ ప్రతి మహిళ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ పై అవగాహన పెంచుకోవాలన్నారు. సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్టు, ల్యాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జన్ డాక్టర్ జాస్మిన్ రథ్ మాట్లాడుతూ తీరికలేని నేటి సమాజంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సర్వసాధారణమైపోయిందన్నారు. కానీ శరీరంలో మార్పులను గమనించడం, నివారణా చర్యలు తెలుసుకోవడం, ప్రతి సంవత్సరం వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధులను రాకుండా ముందస్తుగానే అరికట్టవచ్చన్నారు.
ఈ జాగ్రత్తలు పాటించాలి:
ప్రతి మహిళ తనకు అవసరమైన టీకాల వివరాలు తెలుసుకోవాలి. తమ పిల్లల టీకా షెడ్యూల్‌ను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. వ్యాధుల బారిన పడకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్, ఎంఎంఆర్, హెపటైటిస్-బీ, వరిసెల్లా వంటి టీకాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.