Mark Shankar | తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు సింగపూర్‌లో జరిగిన ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) వివరణ ఇచ్చారు. తన కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో ప్రమాదం జరిగిందని అరకు పర్యటనలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంపునకు వెళ్లారని.. ఆ సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. దాదాపు 30 మంది విద్యార్థులు సమ్మర్ క్యాంప్‌లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పినప్పుడు చిన్నదే అనుకున్నానని.. కానీ దాని తీవ్రత ఇంతలా ఉంటుందని ముందు ఊహించలేదని అన్నారు.
అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందని తెలిపారు. పొగ పీల్చడం వల్ల ఇబ్బందులు రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. పెద్ద కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదం గురించి తెలియగానే మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారని పవన్ కల్యాణ్ తెలిపారు. సింగపూర్ హైకమిషనర్ కూడా దీనిపై సమాచారం అందించారని పేర్కొన్నారు. అవసరమైన సహాయం చేసేందుకు చాలామంది ముందుకొచ్చారని.. ఆ సమయంలో తనకు అండగా నిలిచిన వారందరీకి కృతజ్ఞతలు తెలిపారు. మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
సింగపూర్‌లోని రివర్ వ్యాలీ షాప్‌హౌస్‌లో మంగళవారం ఉదయం 9.45 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు సిబ్బంది గాయపడ్డట్లు తెలుస్తోంది.