
సిటీబ్యూరో, నవంబర్ 9(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో మద్యం దుకాణాలకు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి, 20వ తేదీన లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయిస్తామని ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ అజయ్‌రావు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్.శ్రీనివాస్‌రావులు వెల్లడించారు. కొత్త మద్యం దుకాణాలకు సంబంధించిన హైదరాబాద్ జిల్లా నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ సారి మద్యం దుకాణాల కేటాయింపు చాలా సరళతరం చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ యూనిట్లలో 179 మద్యం దుకాణాలున్నాయని, అందులో 24 దుకాణాలకు ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు రిజర్వేషన్ కల్పించామన్నారు. దరఖాస్తులను నాంపల్లిలోని జిల్లా ఎక్సైజ్ ప్రధాన కార్యాలయంలో అందజేయాలన్నారు. 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. 20వ తేదీన ఉదయం 11 గంటలకు అంబర్‌పేట్‌లో మహారాణా ప్రతాప్ ఫంక్షన్ ప్యాలెస్‌లో దరఖాస్తుదారుల సమక్షలో జిల్లా కలెక్టర్ లాటరీ తీస్తారని వివరించారు. ఈ లైసెన్స్ గడువు రెండేళ్ల పాటు ఉంటుందని తెలిపారు. మద్యం వ్యాపారంలోకి అన్ని వర్గాల వారు వచ్చే విధంగా ఈ సారి దరఖాస్తుదారులకు వెసులుబాటు ఉందని వారు వివరించారు.
దరఖాస్తుదారుడు 21 సంవత్సరాలు నిండి, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, పాన్‌కార్డు, ఆధార్ కార్డు, రిజర్వేషన్ కోసం అయితే, కుల ధ్రువీకరణ పత్రం దరఖాస్తుతో పాటు జత చేయాలి. రూ.2 లక్షలు (తిరిగి ఇవ్వబడదు) చెల్లించాలి. దరఖాస్తు చాలా సాధారణంగా ఒకే పేజీలో ఉంటుంది. ఎక్సైజ్ శాఖ వెబ్సైట్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఎక్సైజ్ శాఖ చట్టాల ప్రకారం శిక్ష పడ్డవారు, దివాలా తీసిన వాళ్లు అనర్హులు.
హైదరాబాద్‌లో ఉన్న అన్ని దుకాణాలకు రూ.1.10 కోట్లు లైసన్స్ ఫీజు ఉంటుంది.
ఒకరు ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో కంపెనీలు కూడాపాల్గొనేందుకు అవకాశముంది.
గతంలో సంవత్సరానికి నాలుగు వాయిదాలు, రెండు బ్యాంక్ గ్యారంటీలతో లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిన నిబంధన ఉండేది. ఇప్పుడు వ్యాపారులకు మరింత వెసులుబాటు కల్పిస్తూ దానిని ఆరు వాయిదాలకు పెంచుతూ ఒక బ్యాంక్ గ్యారంటీకి పరిమితం చేశారు.
ఒక క్లస్టర్లో ఉండే దుకాణం ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక సారి దుకాణం ఏర్పాటు చేసిన తరువాత ఆ క్లస్టర్‌లోనే మరో చోటుకు మార్చుకోవాలనుకుంటే రూ.25 వేలు చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ఇది లైసెన్స్ ఫీజులో 2 శాతం ఉండేది.
డ్రాలో దుకాణం దక్కించుకున్న వారు ఎవరైనా వాకింగ్ స్టోర్స్ పెట్టుకోవచ్చు. అలాంటి స్టోర్‌లో లిక్కర్ రిలేటెడ్ వస్తువులు విక్రయించుకోవచ్చు. ఇందుకు రూ.5 లక్షలు అదనంగా చెల్లించాలి.
అన్ని దుకాణాలకు పర్మిట్ రూమ్‌లు పెట్టుకుకోవచ్చు.
దుకాణం యజమానికి లిక్కర్‌పై 27 శాతం, సాధారణ లిక్కర్‌పై 20 శాతం, బీర్‌పై 20 శాతం లాభాలు వస్తాయి. ఇందులో లైసెన్స్ ఫీజుతో పదింతల టర్నోవర్ అయిన తరువాత లాభాలలో 10 శాతం ఎక్సైజ్ శాఖకు ట్యాక్స్ చెల్లించాలి. గతంలో ఇది టర్నోవర్‌లో ఆరింతలు ఉండగా, ట్యాక్స్ 13.6 శాతం ఉండేది, ఈ విషయంలో ప్రభుత్వం వ్యాపారులకు మరింత వెసులుబాటు కల్పించింది.