కాఠ్మాండు, ఆగస్టు 28: నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల తర్వాత ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనేందుకు జరుగుతున్న తీవ్ర ప్రయత్నాలకు మరో అవరోధం ఏర్పడింది. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో కొత్తగా ఏర్పడిన సరస్సు పొంగిపొర్లడం ప్రారంభించడంతో మరో ప్రాణాంతక వరద ఉప్పెనలా విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉన్నది. సరిహద్దు సమీపంలో హిమానీనదం కూలిపోవడంతో సంభవించిన మంచు కొండ విరిగిపడిన దరిమిలా ఆకస్మిక వరదలు విరుచుకుపడటంతో నేపాల్-టిబెట్ సరిహద్దుకు ఇరువైపులా కనీసం 587 మంది మరణించారు. 1,924 మంది గల్లంతయ్యారు.
నీరు, బురద, శిథిలాల వెల్లువెత్తడంతో ఇండ్లు, వాహనాలు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. నేపాల్ పర్యాటక శాఖ వర్గాల సమాచారం ప్రకారం శుక్రవారం రక్షించిన 117 మంది పర్యాటకులలో 85 మంది భారతీయులు, 16 మంది చైనా జాతీయులు, 9 మంది దక్షిణ కొరియన్లు, ఇద్దరు ఇటాలియన్లు, ఇద్దరు అమెరికన్లు ఉన్నారు. కాగా, టిబెట్ వైపున ఒక నీటి ఆనకట్ట తెగిపోయిందని నేపాల్ పోలీసులు శుక్రవారం హెచ్చరిక జారీచేశారు. ఆనకట్ట నుంచి నీరు పొంగిపొర్లుతున్నట్టు చైనా ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. దీంతో టిబెట్‌ను నేపాల్‌తో కలిపే సరిహద్దు మార్గం సమీపంలో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందని సూచించింది. కొత్తగా ఏర్పడిన ఈ సరస్సుకు ఏర్పడిన విపత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్న కారణంగా ఆ ప్రాంతంలో సహాయక చర్యలను అధికారులు నిలిపివేశారు.
ఎనిమిది జిల్లాల నుంచి మరికొన్ని మృతదేహాలను వెలికి తీసినట్టు నేపాల్ పోలీసులు శుక్రవారం తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 579కి పెరిగింది. బుధవారం ఉదయం నుంచి 977 మంది గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు. వీలో 86 మంది భద్రతా సిబ్బంది, 547 మంది విదేశీ పర్యాటకులు, 127 మంది నేపాలీ ప్రయాణికులు ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 1,545 మంది గాయపడిన, చిక్కుకుపోయిన వ్యక్తులను రక్షించారు. వీరిలో 84 మందికి ఖాట్మండులోని దవాఖానల్లో చికిత్స అందిస్తున్నారు.
నేపాల్ వరదల్లో చిక్కుకున్న 300 మందికిపైగా భారతీయుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 85 మంది భారతీయులను రక్షించినటు,్ట 21 మంది యాత్రికులు భారత్‌కు తిరిగి వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. ఆయన వారికి ఢిల్లీలో స్వాగతం పలికి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భారత్ ఇప్పటికే సహాయ సామగ్రితో రెండు విమానాలను నేపాల్‌కు పంపగా, మూడవ విమానం శుక్రవారం బయలుదేరింది.
టిబెట్‌లోని చైనా- నేపాల్ సరిహద్దు వెంబడి ఉన్న ఒక పోర్టును ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో ఐదుగురు మృతిచెందారని, 260 మంది విదేశీయులతో సహా మొత్తం 558 మంది గల్లంతయ్యారని చైనా శుక్రవారం తెలిపింది. బుధవారం టిబెట్ అటానమస్ రీజియన్‌లోని గైరోంగ్ కౌంటీని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.