సిటీబ్యూరో/చాంద్రాయణగుట్ట, సెప్టెంబరు 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా తీసుకువచ్చిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి.. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం రూ.5,937కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
42 ఫ్లై ఓవర్లలో 37 చోట్ల ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన అధికారులు..తాజాగా ఫలక్నుమా ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. వచ్చే పది రోజుల్లోగా ఈ ఆర్వోబీ ప్రారంభానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. చాంద్రాయణగుట్ట-శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో రూ.52 కోట్లతో..
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాహనదారులకు మరింత సౌకర్యంగా ప్రయాణం అందించేందుకు రూ.52 కోట్లతో రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం 360 మీటర్ల పొడువు,7.5 మీటర్ల వెడల్పుతో నిర్మాణ పనులు చేపట్టారు. బ్రిడ్జి మధ్యలో 37 మీటర్ల మేర నిర్మాణం పనులు రైల్వే శాఖ పరిధిలోకి రావడం కారణంగా పనులు కొంత ఆలస్యమయ్యాయి.
ఈ మధ్య కాలంలోనే ఆ పనులు కూడా పూర్తి కావడంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం నూటికి నూరుశాతం పూర్తయింది. బ్రిడ్జిని మరింత అందంగా తీర్చిదిద్దడానికి ఇరువైపులా రంగులు అద్దుతున్నారు. లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో బ్రిడ్జి పూర్తయిన చివరి నుంచి చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొత్తగా రోడ్డు నిర్మాణం పనులు కూడా త్వరలోనే చేపట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మొత్తానికి ఈ నెల చివరికల్లా ఫలక్నుమా రైల్వే ఓవర్ రెండో బ్రిడ్జి ప్రారంభం కానుంది.