బంజారాహిల్స్, ఏప్రిల్ 29 : బంజారాహిల్స్‌లోని తెలంగాణభవన్ వద్ద ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ కటౌట్‌కు నిప్పు పెట్టేందుకు యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ భవన్ వద్ద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో సుమారు 50 అడుగుల ఎత్తైన కేసీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి 10.15 ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి కటౌట్ వద్దకు చేరుకుని నిప్పంటించేందుకు యత్నించాడు.
ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి అతడిని అడ్డుకోవడంతో కటౌట్ పాక్షికంగా దెబ్బతింది. ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు సంఘటనా స్థలంతో పాటు సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించి మంగళవారం ఉదయం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కటౌట్‌కు నిప్పంటించిన వ్యక్తిని తిరుపతిలోని గాంధీపురం ప్రాంతానికి చెందిన యువకుడు యడవల్లి రాజా అని గుర్తించారు. అతడు క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పై ఉంటాడని, మతిస్థిమితం సరిగాలేనట్లు తేలింది. కటౌట్‌ను కాల్చే సమయంలో అడ్డుకున్న వ్యక్తిని బళ్లారికి చెందిన మంజునాథగా గుర్తించారు.