మాదాపూర్, మార్చ్ 8: డిజిటల్ మీడియా వల్ల మహిళలు, సమాజం అనేక విధాలుగా నష్టపోతుందని ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఇంటర్నెట్ నీతి డిజిటల్ వెల్ బీయింగ్ నిపుణుడు, పబ్లిక్ పాలసీ వ్యవస్థాపకులు డా. అనిల్ రాచమల్ల అన్నారు. కొండాపూర్లోని సిఆర్ ఫౌండేషన్ ఆవరణలో ఇంద్రజిత్ గుప్తా హాలులో శనివారం నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనిల్ రాచమల్ల, ఏఐటియుసి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మాజీ కార్యదర్శి డా. బివి విజయలక్ష్మి, సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు డా. జె ప్రభాకర్ రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డిజిటల్ మీడియా వల్ల మహిళలు, సమాజం అనేక విధాలుగా నష్టపోతుందన్నారు. నిత్యజీవితంలో అపరిచితులతో ఎలా ఉంటాము అలాగే అంతర్జాల వినియోగ సమయంలోను ఉన్నట్లయితే మరింత భద్రతగా ఉండవచ్చన్నారు. పలురకాల డిజిటల్ మోసాల గురించి వివరిస్తూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఉపయోగించుకోవాలని చెప్పారు. డిజిటల్ యుగంలో సమాజంలో మహిళలకు భద్రత సమస్యగా మారిందని, దీనిని మనం దైనందిన కార్యక్రమాల్లో వినియోగించే డిజిటల్ ప్లాట్ ఫామ్లో గురించి తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాలు ఎంత తక్కువగా షేర్ చేస్తే అంత మంచిదని చెప్పారు.
అనంతరం నీలం రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ సెంటర్, మహిళా సంక్షేమ కేంద్రం సంయుక్తంగా సరోజినీ దేవి ఆసుపత్రి రిటైర్డ్ సర్జన్ డా. సరస్వతిని సి ఆర్ ఫౌండేషన్ ఆరోగ్య కేంద్రం డైరెక్టర్, డా. రజిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్ జోస్య పట్ల కల్పన, సి ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, వృద్ధాశ్రమ వాసులు, నీలం రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ సెంటర్ సభ్యులు, మహిళ సంక్షేమ కేంద్రం విద్యార్థులు, ఉపాధ్యాయులు, భాష్యం పాఠశాల తో పాటు ఇతర పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.