Hyderabad | హైదరాబాద్ : మద్యం తాగి వచ్చిన భర్తను భార్య మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఎక్కాడు. ఈ ఘటన హైదరాబాద్ సైదాబాద్ పరిధిలోని శంకేశ్వర్ బజార్లో నిన్న రాత్రి చోటు చేసుకుంది.
సైదాబాద్ సింగరేణి కాలనీలో మోహన్ బాబు(25) తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే బుధవారం రాత్రి మోహన్ బాబు పీకల దాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మద్యం ఎందుకు తాగొచ్చవని భార్య బాబును మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాబు.. శంకేశ్వర్ బజార్లో ఉన్న ఓ హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఎక్కాడు.
మోహన్‌బాబును గమనించిన స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు.. బాబును కిందకు దించారు. అనంతరం అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. భార్య మందలించడం వల్లే విద్యుత్ స్తంభం ఎక్కినట్లు బాబు ఒప్పుకున్నాడు. భార్యాభర్తలకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపించేశారు.