పిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల బెడద లేకుండా. వాహనదారులకు పారదర్శకమైన సేవలందించేందుకు కేసీఆర్ పాలనలో తీసుకొచ్చిన ‘టీ యాప్ ఫోలియో’ యాప్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. టీ యాప్ ఫోలియోను రద్దు చేసి ఇప్పటి వరకు యాప్ ద్వారా అందుతున్న సేవలను ‘మీసేవ’ యాప్‌లోకి మార్చారు. అందులో రిజిస్టేష్రన్లు, అప్లికేషన్ అండ్ సర్టిఫికేషన్స్ సేవలతో పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సేవలను చేర్చారు.
వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీఏ సేవలను ఆన్లైస్లో ఒకే చోట అందించిన రవాణా శాఖ తాజాగా ‘మీసేవ’ యాప్‌లోకి టీయాప్ ఫోలియో సేవలను బదలాయించారు. అయితే వాహనదారులు ఆర్టీఏ వెబ్ సైట్లోకి వెళితే అందులో ఇంకా టీయాప్ ఫోలియో సేవలనే వినియోగించుకోండని సూచించడం విశేషం. కానీ ఆ యాప్‌ను ప్రస్తుతం ప్లేస్టోర్‌లో అన్వేషిస్తే మాత్రం కనిపించడం లేదు. దీంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఆర్టీఏ అధికారులు ‘మీసేవ’ యాప్‌లో ఆర్టీఏ సేవలు అందుబాటులో ఉన్నాయనే విషయంపై వాహనదారులకు అవగాహన కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.