GHMC | సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): వర్షాకాల నేపథ్యంలో పురాతన భవనాలు, సెల్లార్ ప్రమాదాలపై జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం అప్రమత్తమై చర్యలు వేగవంతం చేసింది. ప్రమాదకర భవనాలపై జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సర్కిళ్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపడుతూ శిథిల, ప్రమాదకరమైన భవనాలలో ఉన్న నివాసితులను గుర్తించి..
వారిని అక్కడి నుంచి ఖాళీ చేయడానికి గానూ వారికి ముందుగా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. దాంతోపాటు అత్యంత ప్రమాదకరంగా ఉన్న భవనాల సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా ఆయా భవనాల చుట్టూ బారీ కేడ్లను అమర్చుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న శిథిల భవనాలను కూల్చివేస్తున్నారు. వీటితోపాటు అక్టోబర్ నెలాఖరు వరకు వర్షాకాలంలో సెల్లార్ల తవ్వకాల నిషేధం అమల్లో ఉన్నది. ఈ క్రమంలో సెల్లార్ ప్రమాదాలు జరగకుండా టౌన్‌ప్లానింగ్ విభాగం చర్యలు చేపడుతున్నదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.