సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ):వర్షాలు పడుతున్న వేళ పురాతన భవనాలు భయపెడుతున్నాయి…ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. కూలేందుకు సిద్దంగా ఉన్న భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేపించాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వహించిన కారణంగా గడిచిన మూడు రోజుల్లో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి.
మలక్‌పేట ఘటన మరవముందే ఆదివారం హుస్సేనీఆలంలో వర్షానికి పురాతన ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. ఐతే పురాతన భవనాలపై టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టని ఫలితంగానే ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పురాతన భవనాలపై జీహెచ్ఎంసీ మీనమేషాలు లెక్కిస్తోంది..ప్రతి ఏటా వర్షాకాల ముందుగానే ప్రమాదకర భవనాలపై జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సర్కిళ్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. శిథిల, ప్రమాదకరమైన భవనాలలో ఉన్న నివాసితులను గుర్తించి..వారిని అక్కడిని నుంచి ఖాళీ చేయడానికిగానూ వారికి ముందుగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు అత్యంత ప్రమాదకరంగా ఉన్న భవనాల సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు ఆయా భవనాల చుట్టూ బారికేడ్లను ఆమర్చాల్సి ఉంటుంది.
వీటి పరిసర ప్రాంతాల్లోని నివాసితులు తగు జాగ్రత్తలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు శిథిల భవనాలపై గుర్తింపు, గతంలో నోటీసులు ఇచ్చిన భవనాలను పటిష్టత, మరమ్మత్తు పనుల అంశాలపై సమీక్షించిన దాఖలాలు లేవు. కనీసం సర్కిళ్ల వారీగా కూలేందుకు సిద్దంగా ఉన్న భవనాలు లెక్క అధికారుల వద్ద లేదు. దీంతో అసలే వర్షాకాలం..అందులో కుండపోత వర్షాలు కురుస్తున్న దరిమిలా ప్రమాదకర భవనాల పట్ల స్థానికులు, నివాసితుల ప్రాణాల భద్రత గాలిలో దీపంలా మారింది. ఏదైన సంఘటన జరగకముందే అధికారులు అప్రమత్తమై శిథిల భవనాలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.