శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 24: ప్రత్యేకమైన కాయిన్ మార్కెట్లో అమ్మితే కోట్లు వస్తాయని ఓ మహిళను నమ్మించి నట్టేట ముంచిన ఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ప్రత్యేకమైన కాయిన్ తయారు చేయడానికి దాదాపు రూ.4.50లక్షలు అవుతుందంటూ ఆమెకు మాయమాటలు చెప్పి దాదాపు రూ.8.50లక్షలు దోచుకున్న కిలాడీలేడి. ఇప్పుడు దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరింపులకు పాల్పడుండటంతో బాధిత మహిళ శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు ఆశ్రయించింది.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి ప్రాంతానికి చెందిన అరుణ(35)టైలర్‌గా పని చేస్తూ భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటుంది. పక్కనే ఉండే చందు అనే వ్యక్తి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొస్తాయంటూ నమ్మించాడు.దీంతో ఆ మహిళ గత అక్టోబర్ నెలలో మొదట రూ.50వేలు చందు ఆధ్వర్యంలో వెంకట్ అనే మరో వ్యక్తికి ఇచ్చింది. మరోసారి రూ.2లక్షలు పెట్టుబడి పెడితే రూ.10లక్షలు వస్తాయి. రూ.50వేలకు ఏం రాదు అంటూ చెప్పడంతో 15రోజుల తర్వాత మరో రూ.50వేల వెంకట్‌కు ఇచ్చినట్లు తెలిపారు.
డబ్బు ఇవ్వకపోవడంతో చందుని బాధిత మహిళ అడిగింది. దీంతో చందు మీరు ఇచ్చిన డబ్బులు వెంకట్ తీసుకెళ్లాడని, మీరు పెట్టుబడి పెడుతానంటే మీకు అసలైన వ్యక్తిని పరిచయం చేస్తానని, కర్నాటక రాష్ట్రంలోని మైసూర్‌కు చెందిన లక్ష్మీని చందు ఫోన్లో పరిచయం చేశాడు. లక్ష్మిని కలిసేందుకు హైదరాబాద్‌లోని తాజ్కృష్ణహోటల్కు కొద్దిదూరంలో ఉన్న కాఫీ షాపులో కలిశారు. బిజినెస్ కాయిన్ తయారు చేస్తే అధిక డబ్బులకు అమ్మొచ్చని పలు వీడియోలు ఫోన్లో చూపించింది. దీని తయారీకి రూ.4.50లక్షలు ఖర్చు అవుతుందని,రూ.50లక్షల నుంచి కోటి లాభం వస్తుందని నమ్మించింది. దీంతో బాధిత మహిళ మొదటగా అక్కడే రూ.90వేల నగదు ఇచ్చింది.
మిగతావి దఫాదఫాలుగా ఫోన్‌పే ద్వారా ఆన్లైన్లో పంపింది. నువ్వు ఇవ్వకుంటే పెట్టిన డబ్బులు పోతాయని మాయమాటలు చెప్పడంతో డబ్బులు రావేమోనని నమ్మిన బాధిత మహిళ ఫోన్‌పే ద్వారా రూ.10వేలు, 20వేలు, 50వేలు ఇలా విడతలుగా దాదాపు రూ.8.50లక్షల ఫోన్‌పే ద్వారా చెల్లించగా..రోజులు గడిచినా డబ్బులు రావడంలేదు. మోసపోయినట్లు గ్రహించింది. గత శనివారం ఎయిర్‌పోర్టులోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు వచ్చిన లక్ష్మిని పట్టుకునేందుకు బాధిత మహిళ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడ నేను నీకు డబ్బులు ఇస్తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇద్దరికి నష్టమని ఆమెను నమ్మించి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. దీంతో బాధిత మహిళ గురువారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.