జూబ్లీహిల్స్, డిసెంబర్11: సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు సమ ప్రాధాన్యతనిచ్చి అధికారికంగా నిర్వహిస్తున్నారని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలకు రూ.15 కోట్లు కేటాయించారని అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో యునైటెడ్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ క్రిస్టియన్ ఫోరం 182 చర్చిల సమ్మేళనంతో నిర్వహించిన ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేశారు. అనంతరం క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ క్రైస్తవులు దేశం, ప్రపంచం కోసం ప్రార్థనలు చేస్తూ ఏసు ప్రభువు మార్గంలో నడువడంతోపాటు సమాజాన్ని విద్యా స్రవంతిలోకి నడిపించడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఏసు ప్రభువు లోకాన్ని రక్షించినట్లు తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల రక్షణకు నిరంతరం కృషి చేస్తున్నదన్నారు.
ఫోరం కన్వీనర్, బిషప్ డాక్టర్ కె.విద్యాసాగర్, సీనియర్ పాస్టర్లు యేసురాజు, జోసఫ్ నాగేశ్వర్, నాయకులు విజయ్ కుమార్ నాయకత్వంలో ది లార్డ్స్ చర్చి ఫౌండర్ రెవ.డాక్టర్ రాజ్ప్రకాశ్పాల్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు.
కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ శంకర్ లూక్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్, సినీ నటుడు సూర్యభగవాన్, సీనియర్ పాస్టర్లు పమ్మి డానియల్, లిల్లీ డానియల్, కార్పొరేటర్లు బాబాఫసియుద్దీన్, రాజ్‌కుమార్ పటేల్, సీఎన్‌రెడ్డి, దేదీప్య విజయ్, వనం సంగీత యాదవ్ పాల్గొన్నారు. ఆయా డివిజన్ల చర్చిల ప్రతినిధులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందించిన క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు.