సిటీబ్యూరో, జులై 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు వ్యక్తిగత కార్యదర్శి అని.. తిరుపతిలో సుప్రభాత దర్శనం చేయిస్తానంటూ ఓ డాక్టర్‌కు సైబర్‌నేరగాళ్లు రూ. 1.57 లక్షలు బురిడీ కొట్టించారు. యాప్రాల్‌కు చెందిన ఒక డాక్టర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏప్రిల్‌లో దీప్ అనే పేరుతో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నాని చెప్పుకున్నాడు.
అతని మాటలు నమ్మిన ఆమె తిరుమలలో దర్శనం గూర్చి మాట్లాడింది. తాను ఎల్1 బ్రేక్ దర్శనం చేయిస్తానని, టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి పవన్‌ను సంప్రదించండంటూ ఒక నంబర్‌ను పంపించాడు. దీంతో ఆమె పవన్‌ను కాంటాక్టు కావడంతో “మీకు దర్శనం చేయిస్తానని, ఇందుకు సంబంధించిన డబ్బులు ఈ నంబర్లకు పంపాలంటూ” రెండు యూపీఐ ఐడీలు పంపించాడు. దీంతో బాధితురాలు దఫ దఫాలుగా రూ. 1.67 లక్షలు ఆయా నెంబర్లకు పంపించింది.
24 మందికి బ్రేక్ దర్శనం, గదులను బుక్ చేశానని, ఇందుకు సంబంధించి ఆలయం నుంచి మేసేజ్‌ను కూడా వచ్చిందని ఆమెకు పంపించాడు. తమకు దర్శనం స్లాట్ బుక్ అయ్యిందని భావిస్తున్న క్రమంలో బాధితురాలు టీటీడీ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆరా తీసింది. దర్శనం పేరుతో మోసాలు జరుగుతున్నాయని, కేసులు కూడా నమోదయ్యాయని, భక్తులను మోసం చేస్తున్న విషయాలు అందులో ఉండడంతో అనుమానం వచ్చి తనకు వచ్చిన మేసేజ్‌లను తనిఖీ చేయించుకుంది. అయితే అవన్ని నకిలీవని తేలడంతో అప్పటి వరకు తాము టీటీడీ చైర్మన్ పీఏనంటూ చెప్పుకున్న పవన్‌ను నిలదీసింది, డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలంటూ నిలదీయడంతో రూ. 10 వేలు పంపించాడు. మిగతా డబ్బులు ఇవ్వకుండా సెల్‌ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఇదంతా మోసమని గుర్తించి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.