బంజారాహిల్స్, మార్చి 4 : అత్యవసర పరిస్థితిలో రోగుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్ల మీద సైరన్ వేసుకుని పరుగులు పెట్టాల్సిన అంబులెన్స్‌లను కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. అవసరం లేకున్నా సైరన్లు వేసుకుంటూ వాహనదారులను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ట్రాఫిక్ పోలీసులను గందరగోళానికి గురిచేస్తున్నారు.
మంగళవారం మధ్యాహ్నం పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో వెస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా.. సైరన్ వేసుకుని ఓ అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్‌లో రోగి ఉన్నాడా? లేదా? అని ట్రాఫిక్ పోలీసులు డోర్ తెరిచి చూడగా.. పెంపుడు కుక్క కనిపించింది. దీంతో అంబులెన్స్ డ్రైవర్ లక్ష్మీనారాయణను ప్రశ్నించగా..
తాను హిమాయత్‌నగర్ నుంచి పెంపుడు కుక్కను తీసుకువస్తున్నానని, మదీనగూడలోని ఐవీ హాస్పిటల్లో కుక్కకు వేసెక్టమీ ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పాడు. వేసెక్టమీ ఆపరేషన్ చేసేందుకు సైరన్ వేసుకుని ఎందుకు వెళ్తున్నావని ట్రాఫిక్ పోలీసులు ప్రశ్నించగా, సమాధానం చెప్పకపోవడంతో అంబులెన్స్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.