అంబర్‌పేట, మే 26 : నకిలీ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కే మూర్తి మంగళవారం అంబర్‌పేటలోని జోన్ కార్యాలయంలో వివరాలను మీడియాలకు వెల్లడించారు. బాగ్‌అంబర్‌పేటకు చెందిన బ్రాహ్మణి ప్రియా పేస్బుక్ ద్వారా అపరిచిత వ్యక్తులతో పరిచయం ఏర్పరుచుకున్నారు. ఏప్రిల్ 22న వారు సాప్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆమె నుంచి రూ.2.30 లక్షలు తీసుకొని నకిలీ నియామకపు పత్రాలను జారీ చేశారు.
ఆ నియామకపు పత్రం చూస్తే నకిలీదని తేలింది. మోసపోయానని భావించి అంబర్‌పేట పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు టి.కిషోర్ అలియాస్ మంజునాథ్‌ను మే 15న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి రూ.2 లక్షల నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని సెల్‌ఫోన్ డాటా ఆధారంగా కేసును దర్యాప్తు చేయగా… ఈ నకిలీ నియామకపు పత్రాల జారీ వెనుక ఒక ముఠా ఉందని పోలీసులు గ్రహించారు.
కూకట్‌పల్లిలో నివాసముంటున్న టి.కిషోర్, బెంగళూరుకు చెందిన కీర్తిక్ బి.వై అలియాస్ రాయల్ మోసిస్, సాయి, ప్రీతిలతో కలిసి కుట్ర పన్ని ఒక ముఠాగా ఏర్పడ్డారు. ‘అడ్మిఫిట్ కన్సల్టెన్సీ’ అనే నకిలీ కన్సల్టెన్సీని సృష్టించి నిరుద్యోగుల నుంచి రెజ్యూమ్‌లను సేకరించారు. వాటిని రాయల్ మోసిస్(కీర్తిక్, అడ్మిఫిట్ కన్సల్టెన్సీకి చెందిన సాయికి ఫార్వర్డ్ చేశారు. ఆ తర్వాత వారు పేరెన్నికగన్న సాఫ్ట్వేర్ కంపెనీల నకిలీ నియామకపు పత్రాలను తయారు చేసి వాట్సాప్ ద్వారా బాధితులకు పంపారు. అలాగే నకిలీ బ్యాంకు ఖాతాలు, సిమ్ కా ర్డులు ఏర్పాటు చేయడం కోసం నిందితులు సహకార బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఏపీ పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వేముల శంకర్‌ను సంప్రదించారు.
దీంతో శంక ర్, సుబ్బారావు, గోపీకృష్ణ, అశోక్, నాగుర్ తదితరుల పేర్లతో ఒక్కొక్కటి రూ.25వేల చొప్పున సుమారు 15 నకిలీ బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులను సరఫరా చేశా రు. ఈ నకిలీ బ్యాంకు ఖాతాల ద్వారా నిందితులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సుమారు 35 నుంచి 40 మంది నిరుద్యోగులను మోసం చేశారు. ఇప్పటివరకు ఈ రాకెట్‌కు సంబంధించి 11 ఎప్ఐఆర్లు, సైబర్ క్రైమ్ పోర్టల్‌లో దాదాపు 25 నుంచి 28 ఫిర్యాదులు నమోదయ్యా యి.
మంగళవారం పోలీసులు బెంగళూరు నివాసి కీర్తిక్ బి.వై, గుంటూరు నివాసి శంకర్, అశోక్‌లను అరెస్టు చేశా రు. నిందితుల నుంచి సిమ్‌కార్డులు, బ్యాంకు బుక్కులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య, ఓయూ ఏసీపీ జి.జగన్, అంబర్‌పేట ఇన్స్పెక్టర్ టి.కిరణ్‌కుమార్, డీఐ మహ్మద్ హఫీజుద్దీన్, సైబర్ క్రైమ్ ఎస్సై మేఘన పాల్గొన్నారు. ఈ కేసులో బాగా పని చేసిన క్రైమ్ టీమ్ భరత్, శ్రీధర్, కిషన్,వంశీ, అరుణ్‌లను డీసీపీ అభినందించారు.