Amberpet | గోల్నాక, మార్చి 24: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం సాయంత్రం అంబర్‌పేట డివిజన్ ఓవైసీ నగర్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు ఎంతో భక్తిశ్రద్ధలతో పాటిస్తారని, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. రంజాన్ మాసం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఇఫ్తార్ విందులతో సోదర భావం పెంపొంది, ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట ఇన్స్పెక్టర్ డి.అశోక్, అంబర్‌పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, ముస్లిం మత పెద్దలు అప్రోజ్ పటేల్, అమీర్, మోసిన్, నాయకులు సంతోష్ చారి, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.