Amrapali Kata | సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : 2010 బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలికి కేంద్రం షాకిచ్చింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు కాకముందే.. ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తెలంగాణలో ఉన్న 11 మంది ఐఏఎస్‌లను ఏపీ క్యాడర్‌కు చెందిన వారిగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తప్పనిసరిగా ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో గ్రేటర్లో ఆమె సేవలు మూణ్నాళ్ల ముచ్చటగానే మారాయి. 2010లో శిక్షణ పూర్తి చేసుకున్న ఆమ్రపాలి.. తొలుత వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
అప్పటి నుంచి తెలంగాణ ప్రాం తంలోని జిల్లాల్లో పలు హోదాల్లో పనిచేశారు. ఆమె స్థానికత విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో.. అఖిల భారత సర్వీసుల్లో అధికారుల కేటాయింపు విషయంలో తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆమ్రపాలికి ఇబ్బందిగా మారింది. గతంలో ఆమె తనను తెలంగాణకు కేటాయించాలని చేసిన అభ్యర్థనను కూడా పరిగణనలోకి తీసుకోకుండా వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో అనివార్యంగానే తెలంగాణను విడిచి ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉండగా… ఆ జాబితాలో గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన రోనాల్డ్ రాస్ కూడా ఉన్నారు.
విశాఖపట్నం తన స్వస్థలంగా పేర్కొనడంతో ఆమ్ర పాలిని ఏపీ క్యాడర్‌కు కేటాయించినట్లు తెలిసింది. గతంలో తనను తెలంగాణ స్థానికురాలిగా గుర్తించి తెలంగాణ క్యాడర్‌కు పంపాలని ఆమ్రపాలి క్యాట్‌ను ఆశ్రయించినా… ప్రయోజనం లేకుండా పోయింది. 2010లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2020 వరకు పలు శాఖల్లో పనిచేశారు. హైదరాబాద్‌లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారిగా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా సేవలు అందించారు. అక్కడి నుంచి జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్‌గా బదిలీపై వచ్చిన ఆమ్రపాలి, ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘంలోనూ పనిచేశారు.
అనూహ్యంగా 2020లో ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడంతో కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై వెళ్లారు. కొంతకాలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక సలహాదారురాలిగా పనిచేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడి నుంచి మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చేయగా… జూన్ నెలాఖరులో జీహెచ్ఎంసీ కమిషనర్ పగ్గాలు అందుకున్నారు. కానీ బాధ్యతలు చేపట్టి, పాలనపై పట్టు తెచ్చుకుంటున్న లోపే ఏపీకి వెళ్లాలంటూ కేంద్రం ఆదేశించింది. దీంతో ఆమ్రపాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గతంలో ఆమె చేసిన అభ్యర్థనను కేంద్రం తిరస్కరించడంతో… ఇక ఏపీకి వెళ్లడం అనివార్యమేనని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.