మేడ్చల్, మార్చి1(నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ అంచనాలను సిద్ధం చేస్తున్నారు. 2022-23 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్డెట్లో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలకు నిధులను కేటాయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్, నిజాంపేట్ కార్పొరేషన్లు కాగా, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, దుండిగల్, తూంకుంట, కొంపల్లి మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు కార్పొరేషన్లు 2022-23 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు పాలకవర్గాలు ఆమోదం తెలిపాయి. మరో నాలుగు మున్సిపాలిటీల్లో కూడా ఈ వారం రోజుల్లో బడ్జెట్ కేటాయింపులను పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సమావేశాలు నిర్వహిస్తూ బడ్జెట్..
జిల్లాలోని మున్సిపాలిటీల పాలకవర్గం బడ్జెట్‌కు సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాలకవర్గం ఆమోదంతో నిధులను కేటాయిస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ సమక్షంలో ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే వీటిని పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.