మేడ్చల్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నామినేషన్లను స్వీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ ఆర్వోలు, ఈఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐదు నియోజకవర్గాల రిటర్నింగ్ కార్యాలయాల వద్ద నామినేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్లు స్వీకరించే మొదటి రోజు నుంచి ప్రక్రియ ముగిసే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయాలన్నారు.
అత్యవసర సేవల పరిధిలోని శాఖలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
అత్యవసర సేవల పరిధిలోని శాఖలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి నవంబర్ 7వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇందులో భాగంగా 13 శాఖలకు సంబంధించి బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ప్రత్యేకంగా అవకాశం ఉన్నదన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్, భారతీయ రైల్వే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆలిండియా రేడియో, విద్యుత్‌శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రాష్ట్ర రవాణా సంస్థ, ఆహారం, పౌరసరఫరాలు, బీఎస్ఎన్ఎల్, పోల్ డే కవరేజ్, ఈసీఐ ద్వారా అనుమతి పొందిన మీడియా వ్యక్తులు, అగ్నిమాపక సేవలు, తదితర శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ.. ఓటు హక్కును వినియోగించుకోలేని వారు మాత్రమే దరఖాస్తులను ఫారం(12-డీ) లో తమ పూర్తి వివరాలతో రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం అర్హత గల ఓటర్ల జాబితాను తయారు చేసి, వారికి పోస్టల్ బ్యాలెట్ పత్రాలను అందజేస్తారని కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో డీఆర్వో హరిప్రియ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేశ్ వ్యాస్ ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, డీసీబీ శబరీశ్ తదితరులు పాల్గొన్నారు.