GHMC | సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. దాదాపు నాలుగున్నర నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్ని పార్టీలకు సంబంధించి 23 ప్రశ్నలతో సుదీర్ఘంగా చర్చ సాగేలా సభ సన్నద్ధమైంది. అయితే ఈ సభ ప్రత్యేకతను సంతరించుకున్నది. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ మారిన మేయర్ రాజీనామా డిమాండ్, అభివృద్ధి, ఆరు గ్యారంటీల అమలు ఎజెండాగా బీఆర్ఎస్ ముక్త కంఠంతో ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ అభివృద్ధి కుంటుపడటం, స్వయానా సీఎం రేవంత్‌రెడ్డి శాఖ అయిన జీహెచ్ఎంసీపై ఏనాడూ సమీక్షించకపోవడం, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడం, పారిశుధ్యం పడకేయడం, దోమలతో డెంగ్యూ వ్యాధుల విజృంభణ, నాలా సమస్యలు, అక్రమ నిర్మాణాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు సిద్ధంగా ఉండటంతో సభ సజావుగా సాగుతుందా? సమర్థవంతంగా నిర్వహించలేక మేయర్ చేతులేత్తేస్తారా? అన్నది వేచి చూడాలి.
అధికార పార్టీ కంటే బలంగా ఉన్న ప్రతిపక్షాలు..
సభలో విచిత్ర పరిస్థితి నెలకొంది. గడిచిన కొన్ని నెలలుగా జంపింగ్ జపాంగ్‌లు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో నేటికీ బీఆర్ఎస్ మాత్రమే బలంగా ఉంది. 150 మంది కార్పొరేటర్లలో ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా కాగా, మరో ఇద్దరు ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు 47 మందితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఇక ఎంఐఎం 41, బీజేపీ 39, కాంగ్రెస్ 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.
మేయర్ రోల్‌పై ఆసక్తి..
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచాక మేయర్ అయ్యారు. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్‌లో చేరారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మేయర్ కన్నా ముందే కాంగ్రెస్‌లో చేరారు. కొందరు కార్పొరేటర్లు సైతం తామున్న పార్టీల నుంచి ఇతర పార్టీల్లోకి మారారు. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు ఎవరు ఏ పార్టీలోకి వెళ్లినా ఎలాంటి సమస్యలుండవు. ఎలాంటి అవిశ్వాసానికి తావు లేదు. విజయలక్ష్మి మేయర్ అయ్యేటప్పుడు బీఆర్ఎస్ పార్టీకున్న కార్పొరేటర్ల బలం వల్ల ఆమె మేయర్ అయ్యారు.
ఇప్పటికీ జీహెచ్ఎంసీలో మిగతా పార్టీల కంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తే వివిధ అంశాలపై బీఆర్ఎస్ సభ్యులు మూకుమ్మడిగా స్పందించేవారు. మేయర్ సైతం బీఆర్ఎస్ కావడంతో సభ అనుకూలంగా నడిచేది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల సంఖ్య రెండు నుంచి దాదాపు ఇరవైకి చేరువైనప్పటికీ, మిగతా పార్టీల సభ్యుల కంటే తక్కువ. గతంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి చెబుతూ విమర్శలను తిప్పకొట్టిన బీఆర్ఎస్ సభ్యులు.. ఇప్పుడు వివిధ సమస్యలను ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మేయర్ ఎలా వ్యవహరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. కాగా జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి ఇది తొలి సమావేశం.
సమస్యలపై ప్రశ్నిద్దాం: బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
ప్రజా సమస్యలు, నగరంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ సమావేశంలో ముక్త కంఠంతో ప్రశ్నించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల సమావేశంలో కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు దాటినా నేటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం, రూ.4వేల పెన్షన్ పెంపు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం పంపిణీ, డబుల్ బెడ్ర్రూం ఇండ్ల నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలు ఇంత వరకు అమలుకు నోచుకోకపోవడంపై ప్రధానంగా చర్చించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన అనేక అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇది సరైన విధానం కాదని సమావేశంలో పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణ కూడా సక్రమంగా లేదని, ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయి ఉన్నాయని, ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలాల్లో పూడిక తొలగింపు పనులు కూడా చేపట్టడం లేదని తెలిపారు. తమను గెలిపించిన ప్రజల పక్షాన ఈ అంశాలన్నింటిపై జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, సుధీర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కాలేరు వెంకటేశ్, మాజీ మంత్రి మహమూద్ అలీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.