అబిడ్స్, డిసెంబర్ 25: నగరంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించేందుకు గాను సొసైటీ ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా స్టాల్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నుమాయిష్ ప్రారంభోత్సవం నాటికి స్టాల్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు 46 రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహిస్తారు. పారిశ్రామిక ప్రదర్శనకు గాను దాదాపు 2500 స్టాళ్ల నిర్మాణం చేసేందుకు గాను నిర్వాహకుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతో పాటు స్టాళ్ల కేటాయింపు చివరి దశకు చేరుకుంది. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షణలో ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్, కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎగ్జిబిషన్‌కు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి లభించగా ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల స్టాళ్లు, ఫుడ్ కోర్టులు, సందర్శకులను అలరించేందుకు గాను అమ్యూజ్మెంట్ పార్క్ ఇలా అనేక స్టాళ్లు ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయి.
ప్రవేశ రుసుము రూ.50..
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ప్రవేశ రుసుమును 50 రూపాయలుగా ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ ఉపాద్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్, కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్ తెలిపారు. ఇప్పటి వరకు 40 రూపాయలుగా ఉన్న ప్రవేశ రుసుము పది రూపాయలు పెంచి 50 రూపాయలుగా నిర్ణయించినట్లు వివరించారు. పెరిగిన ప్రవేశ రుసుము జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ నుంచి అమలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.
కొనసాగుతున్న స్టాళ్ల పనులు
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు వచ్చే సందర్శకుల కోసం మరిన్ని వసతులు కల్పిస్తున్నాం. ఎగ్జిబిషన్‌ను పురస్కరించుకుని స్టాల్ల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయాలను పెంచనున్నాం. స్టాల్ల కేటాయింపులో కూడా సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– నిరంజన్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు
సందర్శకులకు మరిన్ని వసతులు
ఎగ్జిబిషన్ నిర్వహించే 46 రోజుల పాటు సందర్శకులకు అన్ని రకాల వసతులు కల్పించనున్నాం. సందర్శనకు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటాం. నుమాయిష్ సందర్శనకు వచ్చే సందర్శకులకు పూర్తి స్థాయి భద్రత కల్పించేందుకు గాను మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నాం ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తాం.
– మోహన్, ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్త కార్యదర్శి