Hyderabad | కుత్బుల్లాపూర్, ఆగస్టు11: అతిగా మద్యం సేవించి.. రాత్రంతా నగరాన్ని చుట్టేందుకు కారులో వెళ్లిన పోకిరీల నిర్లక్ష్యం.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ అమాయకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన కూన మనీశ్‌గౌడ్ (20) శనివారం రాత్రి తన స్నేహితులు మరో ఐదుగురితో కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులోనే రాత్రంతా నగరాన్ని చుట్టేందుకు కారులో వెళ్లారు. కారును మనీశ్‌గౌడ్ డ్రైవింగ్ చేస్తుండగా.. మిగతా స్నేహితులు కారులో ఉన్నారు.
ఉదయం సమయంలో నిజాంపేట నుంచి దేవేందర్‌నగర్ మీదుగా కుత్బుల్లాపూర్ వైపు వచ్చేందుకు వాహనాన్ని మలుపుతిప్పారు. కారు వేగంతో దూసుకెళ్తోంది. దేవేందర్‌నగర్ మూలమలుపు వద్ద నడుచుకుంటూ వెళ్తున్న బాషాగోపి (38)ని ఢీకొట్టడంతో 10 మీటర్ల దూరంలో పడిపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న విద్యుత్ స్తంభాన్ని సైతం కారు ఢీకొట్టడటంతో పూర్తిగా విరిగిపోయి.. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కారులో ఉన్న మిగతా ఐదుగురు తేరుకొని బయటకు వచ్చి.. అక్కడి నుంచి జారుకున్నారు.
డ్రైవింగ్ సీటులో ఉన్న మనీశ్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతికి కారకుడైన మనీశ్‌కు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయగా.. మద్యం సేవించినట్లు తేలింది. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాషాగోపి తండ్రి నర్సింగరావు మృతి చెందగా, తల్లి కమలమ్మతో కలిసి ఉంటున్నాడు. ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీగార్డుగా పని చేసుకుంటూ.. వృద్ధురాలైన తల్లిని పోషించుకుంటున్నాడు. ఆమె కోసం ఆదివారం ఉదయం టిఫిన్ తెచ్చేందుకు బయటకు వెళ్లిన గోపి.. దేవేందర్‌నగర్ మూలమలుపు వద్ద నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్న ఒక్క కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కమలమ్మ ఒంటరిగా మిగిలిపోయింది.