తెలుగుయూనివర్సిటీ, అక్టోబర్ 18: అలయ్ బలయ్ తెలంగాణలో విశిష్టమైన సంస్కృతికి ప్రతీక అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అబిడ్స్ బొగ్గులకుంట తిలక్‌రోడ్డులోని దేవుపల్లి రామానుజరావు కళామందిరంలో మంగళవారం జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా అలయ్ బలయ్-2022 కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురు ప్రముఖులకు ఈ సందర్భంగా ఆత్మీయ సత్కారం చేశారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ..తెలంగాణకు గుండెకాయలాంటి అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్ ప్రాంతంలో కుల, మతాలకతీతంగా ఐక్యంగా జీవనం సాగించే సంస్కృతి గంగాజమునా తహెజీబ్‌కు నిదర్శనమన్నారు.
తొలిసారిగా జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో అలయ్‌బలయ్ ఉత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని అభినందించారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. వార్తాసేకరణ అనేది నిత్యం జర్నలిస్టులకు కత్తిమీద సాములాంటిదన్నారు. కిందిస్థాయి విలేకరులను పత్రికాయాజమాన్యాలు పట్టించుకోని దుష్టసంప్రదాయం కొనసాగడం విచారకరమన్నారు. విలేకరులపై ఆరోపణలకు పత్రికా యాజమాన్యాల లోపమే కారణమన్నారు. కనీస వేతనాలు ఇచ్చి ఆదుకుని ప్రోత్సహించాలన్నారు. దయనీయస్థితిలో ఉండికూడా విలేకరులు ఆత్మగౌరవంతో పని చేస్తున్నారంటే ఒక వ్యసనంగా అలవాటు కావడం వల్లేనని, యాజమాన్యాలు వారిని ఆదుకోవాలని కోరారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ.. గోషామహల్ జర్నలిస్టులను స్ఫూర్తిగా తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
సమాజంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని, పోలీసు ఉన్నతాధికారులను ఆయన కోరారు. నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..గోషామహల్ వర్కింగ్ జర్నలిస్టులు నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టి అలయ్‌బలయ్ చేపట్టి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌యూజే అధ్యక్షుడు చంద్రశేఖర్, రామారావు, సీనియర్ జర్నలిస్టులు జి.నరేందర్, జూలూరు రమేశ్, వి.రఘువీర్, జి.రమేశ్, పి.జంగయ్య, గోషామహల్ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు డి.ఎస్.సుభాశ్ కృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు గజ్జల వీరేశ్, ప్రధాన కార్యదర్శి వై.సతీశ్‌కుమార్, కోశాధికారి ఎం.శ్రీధర్, ఏసీపీలు వెంకట్‌రెడ్డి, దేవేందర్, ఎల్బినగర్ ట్రాఫిక్ ఏసీపీ సి.అంజయ్య, ఇన్స్పెక్టర్లు ప్రసాదరావు, ఎన్.శంకర్, బాల నాగిరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, అజయ్‌కుమార్, ఎం.రవీందర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు ముజీబ్, ఎంబీ కృష్ణయాదవ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, కార్పొరేటర్లు డాక్టర్ సురేఖ, జి.శంకర్ యాదవ్, లాల్‌సింగ్, టీఆర్ఎస్ నేతలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ధూం ధాం కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆలోచింపజేస్తూ అలరించాయి.