రవీంద్రభారతి, సెప్టెంబర్ 17: అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రవీంద్రభారతిలోని ప్రధాన కళా వేదికపై పలువురికి అక్కినేని నాగేశ్వరరావు జీవన సాఫల్య పురస్కారాల ప్రదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి తమిళనాడు పూర్వ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రావుకు అక్కినేని జీవన సాఫల్య పురస్కారాన్ని పలువురు వక్తలు అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సినీనటుడు మురళీమోహన్ మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన అక్కినేని నాగేశ్వరావు ఆయన సినిమా రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన నటించిన సినిమాలు సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఉంటాయన్నారు. అక్కినేని నాగేశ్వరరావు జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్న పూర్వ తమిళనాడు రాష్ట్ర గవర్నర్ పీఎస్ రామ్మోహనరావును పలువురు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని కటుంబ సభ్యులు, తోటకూర ప్రసాద్ పలువురు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.