హిమాయత్‌నగర్,మే13: దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ యూజీ పరీక్ష 2026 పరీక్షను రద్దు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం హిమాయత్‌నగర్ వై జంక్షన్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షకు హాజరయ్యారని,నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ,అక్రమాలు బయట పడ టంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింద న్నారు.
ఈ పరీక్షను రద్దు చేయడంతో లక్షలాదిమంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం మాడు =తోందని మండిపడ్డారు. విద్యార్థుల ఆర్థిక నష్టానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నీట్ పరీక్షను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను రద్దు చేయడంతో పాటు ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసు కోవాలన్నారు. నీట్ పరీక్ష నిర్వహణకు రాష్ర్టాలకే ఇవ్వాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్ ,నేతలు సామిడి వంశీవర్ధన్‌రెడ్డి,అరుణ్,హరీష్,రంజిత్,సుమన్ పాల్గొన్నారు.