ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లును తక్షణమే భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూడ్లో చేర్చాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓబీసీఎస్ఏ) డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్ తో ఏఐఓబీసీఎస్ఏ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఈ నెల 21న సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్, జాతీయ కార్యదర్శి మహేశ్ గౌడ్ తెలిపారు. దీక్షకు సంబంధించిన వాల్పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్, మహేశ్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీని కోసమే దీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఉద్యమానికి బీసీ మేధావులు, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుతోనైనా బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పందించని పక్షంలో ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఓబీసీఎస్ఏ నాయకులు లక్కీ, రామ్ గౌడ్, ప్రశాంత్, కళ్యాణ్ యాదవ్, శివ యాదవ్ పాల్గొన్నారు.