కాచిగూడ, ఏప్రిల్ 24: ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా తెలంగాణలో ఆనందంగా జీవించాలనే విశాల హృదయం కలిగిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ కర్ణాటక సాహిత్య మందిర్ పునర్నిర్మాణం కోసం అహర్నిషలు కృషి చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి రూ.5 కోట్ల రూపాయాల మంజూరు పత్రాన్ని తీసుకువచ్చిన సందర్భంగా కాచిగూడ కర్ణాటక సాహిత్య మందిర్ ప్రతినిధుల ఆధ్వర్యంలో బర్కత్‌పుర లింగంపల్లిలోని కర్ణాటక సాహిత్య మందిర్‌లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు దృఢసంకల్పంతో ఉన్నారని, ఆ దిశగా బృహోత్తర ప్రణాళికతో ముందుకెళ్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న కన్నడ ప్రజల సమస్యలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. అనంతరం కర్ణాటక సాహిత్యమందిర్ అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ కర్ణాటక సాహిత్య మందిర్ పునర్నిర్మాణం కోసం రూ.5 కోట్లు ఇవ్వడం చారిత్రత్మాక నిర్ణయమన్నారు. కన్నడ ప్రజలు కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పారు. పొరుగు రాష్ర్టాల్లో లేని అనేక సంక్షేమ పథకాలను పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్‌లీడర్, బీఆర్ఎస్ నాయకుడు దిడ్డి రాంబాబు, డివిజన్ అధ్యక్షుడు భీష్మాదేవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్, ఓం ప్రకాశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.