తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 13: ఇంటి ఆవరణాన్ని అరుదైన వనంగా మార్చాలనుకునే ఔత్సాహికులకు అగ్రిహార్టికల్చర్ సొసైటీ ఆహ్వానం పలుకుతున్నది. ఆసక్తి ఉన్న వారికి మొక్కలు, విత్తనాలు అందించడంతో పాటు సంరక్షణపై సొసైటీ సభ్యులు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. పబ్లిక్ గార్డెన్ ప్రాంగణంలో ఉన్న అగ్రిహార్టికల్చర్ సొసైటీలోని సభ్యులంతా ఉద్యాన, వ్యవసాయ విశ్వవిద్యాలయాల విశ్రాంత ఆచార్యులు, శాస్త్రవేత్తలు. వీరంతా సామాజిక సేవలో భాగంగా మిద్దె తోటల పెంపకంతో పాటు ఔత్సాహిక రైతులకు విలువైన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. బాల్కనీ, మెట్లు, డాబాపై ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, అలంకరణ మొక్కలు, పూలు, ఇతర వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను పండించే విధానాలను వివరిస్తున్నారు. జీవ ఎరువుల తయారీ విధానాన్ని నేర్పిస్తున్నారు. నగర వాసులకే కాకుండా రైతుల కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే యాజమాన్య పద్ధతులను నేర్పిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో రెండు సంవత్సరాలుగా ఈ సొసైటీ తన సేవలు అందించలేకపోయింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనగా.. నగరవాసులు, రైతులకు అధునాతన సాగు పద్ధతులను వివరించేందుకు సిద్ధమవుతున్నది.
సొసైటీలో ఎన్నో అరుదైన మొక్కలు..
అరుదైన పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేసేందుకు అగ్రిహార్టి కల్చర్ సొసైటీ సిద్ధమైంది. స్ట్రాబెరీ, అంజీర్, తెల్ల నేరేడు, లిచి తదితర పండ్ల మొక్కలతో పాటు తెలంగాణ ప్రాంతంలో లభించని మొక్కలను సైతం ఇతర రాష్ర్టాల నుంచి తెప్పించి నగరవాసులకు అందిస్తున్నారు. అంతేకాక తక్కువ సమయంలో కాపునకు వచ్చే మామిడి, జామ, దానిమ్మ, సపోట, నిమ్మ, బత్తాయి, కొబ్బరి, నేరేడు, పనస, ఉసిరి, అరటి, ఎర్ర అలవీర, ఏకబిల్వం, మరో 30 రకాల ఔషధ మొక్కలు, 10 రకాల సుగంధ, 30 రకాల ఆర్నమెంట్, గులాబీ, మందార, ఇక్సోరా, పారిజాత మొక్కలను అందుబాటులో ఉంచారు.
సామాజిక సేవే సొసైటీ లక్ష్యం..
నగరవాసులకు అరుదైన మొక్కలతో పాటు విశ్రాంత ఆచార్యులు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందించేందుకు 1953లో అగ్రిహార్టి కల్చర్ సొసైటీని ఏర్పాటు చేశాం. దశాబ్దకాలంగా నగరవాసులకు నామమాత్రపు ధరలతో పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ మొక్కలను అందిస్తున్నాం. గార్డెనింగ్ రూపకల్పన, మొక్కల పెంపకం, ఎరువుల తయారీపై విశ్రాంత ఆచార్యులు, శాస్త్రవేత్తలతో కలిసి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. అరుదైన మొక్కలు కావాల్సిన వారు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ప్రాంగణంలోని అగ్రిహార్టి కల్చర్ సొసైటీ కార్యాలయంలో గాని 8790438050, 8885641700 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.