Hyderabad Metro | సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): మహానగర ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు అత్యంత కీలకంగా మారింది. రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ చిక్కులు లేకుండా నిర్ణీత సమయంలో కచ్చితంగా గమ్య స్థానాన్ని చేరుకునేలా ప్రధాన ప్రయాణ సాధనంగా మెట్రో నిలిచింది. ప్రతి రోజు సుమారు ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్న మెట్రోను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు మెట్రో అధికారులు ఇటీవల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. మెట్రోలో ప్రయాణించే వారి నమ్మకాన్ని వమ్ము చేయడానికి వారిని గమ్య స్థానాలను చేర్చేందుకు పటిష్టమైన ముందస్తు కార్యాచరణను హైదరాబాద్ మెట్రో అధికారులు సిద్ధం చేశారు. మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. మొత్తం మూడు కారిడార్లలో 69 కి.మీ మేర విస్తరించి ఉన్న మెట్రో మార్గాల్లో క్షేత్ర స్థాయిలో వయా డక్ట్‌లను సాంకేతిక నిపుణుల బృందం పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. మెట్రో మార్గాల్లో వయా డక్ట్ పక్కనే ఉన్న చెట్లను కత్తిరించడం, విద్యుత్ ట్రాక్షన్ సిస్టమ్ పడే ఇతర వస్తువులను తొలగించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ప్రస్తుత వర్షా కాలం సీజన్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వచ్చే సమయంలో రైలు సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, విద్యుత్ సరఫరాకు సంబంధించి ట్రాన్స్‌కో నుంచి మెట్రో రైలు నెట్ వర్క్‌లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ ఫీడర్లకు మార్చడానికి ఉన్న అవకాశాలను గుర్తించనున్నారు. ఇప్పటికే కారిడార్-1లో ఎంజీబీఎస్ వద్ద, మియాపూర్‌లలో విద్యుత్ సబ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ రెండు సబ్ స్టేషన్లకు ట్రాన్స్‌కో నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. ఇక్కడి నుంచి మెట్రో రైలు నెట్ వర్క్ కోసం విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎలక్ట్రికల్ విభాగం అధికారులకు మెట్రో అధికారులు పలు సూచనలు చేశారు.
హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు ప్రారంభమై సుమారు ఆరేండ్లు దాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. వీటన్నింటినీ ఒకసారి సమగ్రంగా అధ్యయనం చేసి, అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా, ఒకవేళ సాంకేతిక సమస్య తలెత్తినా వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేశారు. మెట్రో స్టేషన్లు మొదలుకొని వయా డక్ట్‌ల పొడవునా విద్యుత్ ట్రాక్షన్‌పై పడిన వస్తువులతో కలిగిన ఇబ్బందులు మళ్లీ జరగకుండా చూడాలని, అలాంటి ప్రదేశాలను గుర్తించి, అక్కడ మరోసారి సమగ్రంగా అధ్యయనం చేయనున్నారు. మెట్రో సేవలు ఉదయం ఆరు గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు నిరంతరాయం అందించేందుకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లేలా మెట్రో అధికారులు చర్యలు చేపట్టారు. వర్షా కాలంలో నగరంలో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో మెట్రోలోనే ప్రయాణించేందుకు నగరవాసులు ఆధారపడతారు. ఈ నేపథ్యంలో మెట్రో సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ముందస్తు కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని మెట్రో అధికారులు తెలిపారు.