రామంతాపూర్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో కల్తీ మసాలా తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశాయి. పక్కా సమాచారంతో మేడిపల్లి శ్రీనివాసనగర్ కాలనీలోని సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌లో గురువారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్ర వాతావరణంలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
కారం పొడిలో ఏకంగా 30 శాతం చెక్కపొడి కలిపినట్లు.. స్వదేశీ స్వస్తిక్ బ్రాండ్ పేరుతో డూప్లికేట్ ప్యాకింగ్, లేబులింగ్ చేసినట్లు నిర్ధారించారు. ఒరిజినల్ బ్రాండ్‌ను పోలిన ప్యాకెట్లలో కల్తీ కారంపొడి విక్రయానికి సిద్ధం చేసినట్లు గుర్తించారు. మొత్తం 10,890 కిలోల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.