కంటోన్మెంట్/నాంపల్లి కోర్టులు, జూలై 31: తాము అక్రమాలకు పాల్పడడంతో పాటు చాలా తప్పులు చేశామని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. రాజస్థాన్ దంపతులకు సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మించామని.. డీఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నామన్నారు. కొంత సమయం ఇస్తే తప్పు సరిదిద్దుతామని రాజస్థాన్ దంపతులకు చెప్పామని.. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే నంబర్లను బ్లాక్ చేశామన్నారు. రాజస్థాన్ దంపతుల నుంచి ఒత్తిడి రావడంతో అడ్వకేట్ అయిన తన కుమారుడిని రంగంలో దించినట్లు.. తన కుమారుడి ద్వారా దంపతులను బెదిరించినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.
గాంధీ వైద్యుడి సహకారంతో ..
గాంధీ అనస్థీషియా డాక్టర్ సదానందం సృష్టి నిర్వాహకురాలికి సహకరించడంతో అడ్డూఅదుపూ లేకుండా అక్రమాలకు తెరలేపింది. సదానందం సహకారంతోనే డాక్టర్ నమ్రత సృష్టిని నడిపించింది. ఆంధ్రాలో కొంతమంది ఏఎన్ఎమ్లు, టీచర్ల సహాయాన్ని సైతం.. తీసుకుంది. గిరిజన ప్రాంతాల్లోని పిల్లల తీసుకొని రావడంలో ఏఎన్ఎం కార్యకర్తలే సూత్రధారులుగా పని చేశారు. ఎంత ఎక్కువ మంది పిల్లల్ని తీసుకువస్తే వాళ్లకు అన్ని బహుమానాలను డాక్టర్ నమ్రత అందించేది.
‘సృష్టి’ మోసాల్లో మేనేజర్ కల్యాణిది ప్రముఖ పాత్ర..
సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితురాలు కల్యాణి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి ఫెర్టిలిటీ మోసాల్లో మేనేజర్ కల్యాణి కీ రోల్ పోషించినట్లు సమాచారం. వైజాగ్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో 2012లో ఎఎన్ఎం నర్స్‌గా చేరిన కల్యాణి సేవలను గుర్తించి, 2020లో వైజాగ్ బ్రాంచ్‌కి మేనేజర్‌గా డాక్టర్ నమ్రతా అపాయింట్ చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, నమ్రత చేసే మోసాలకు సహకరించింది.. సృష్టి ఫెర్టిలిటీ లావాదేవీల వ్యవహారాలు మొత్తం కల్యాణి చూసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో తేలింది.
దళారులు పంపించే స్కానింగ్ రిపోర్ట్‌ను ఎడిటింగ్ చేసిన కల్యాణి.. వాటిని వాట్సాప్ లో పిల్లలు లేని తల్లిదండ్రులకు పంపించేది అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. ఇక హైదరాబాద్ కు చెందిన రాజస్థాన్ దంపతులు మొదటిగా కల్యాణినే కలిశారు. జూన్ 5న మగ బిడ్డకు జన్మించిన అసోం మహిళ.. ఆ శిశువును రాజస్థాన్ దంపతులకు కల్యాణి అప్పగించింది. వైజాగ్‌లో కల్యాణికి రాజస్థాన్ దంపతులు రూ. 2 లక్షలు చెల్లించారు. బాబుకు జాండిస్ ఉందని చెప్పి వైజాగ్‌లోని లోటస్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని కల్యాణి చెప్పినట్లు సమాచారం.
ఐదు రోజుల కస్టడీ..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ యజమానురాలు డాక్టర్ నమ్రతను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ సికింద్రాబాద్‌లోని10వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం చంచల్గూడా మహిళా జైలు నుంచి నిందితురాలిని గోపాలపురం పోలీసు స్టేషన్ అధికారిక కార్యాలయానికి తరలిస్తారు. శుక్రవారం నుంచి 5వ తేదీ (మంగళవారం) సాయంత్రం 5.30లోపు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదని, న్యాయవాది సమక్షంలో నిందితురాలని ప్రశ్నించాలని సూచించింది.
విశాఖ పట్టణంలోని సృష్టి సెంటర్లో స్వాధీనం చేసుకున్న కీలక ఆధారాల గురించి ఆమెను విచారించనున్నారు. మూడో నిందిరాలు ఇచ్ఛాయమ్మ (మేనేజర్) వాంగ్మూలంతో పాటు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితురాలు నమ్రత నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి సాక్షాధారాల్ని కోర్టుకు సమర్పించనున్నట్టు పీపీ తెలిపిన వాదనల్ని ఏకీభవించిన కోర్టు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో ఇప్పటివరకు 8మంది నిందితులు రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్నారు. ఇద్దరు నిందితులు ఏ7, ఏ8లు పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నమ్రత కుమారుడు ఏ-2, ఇచ్ఛాయమ్మ ఏ-3లను సైతం పోలీసు కస్టడీకి తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కేసులో 39 మంది సాక్షాలను రిపోర్టులో జోడించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సోదాల్లో 2.37 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.