Schools | సిటీబ్యూరో/కొండాపూర్, మే 15 ( నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ స్కూళ్లల్లో అడ్మిషన్ల దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. విద్యను వ్యాపారంగా మలిచి.. తల్లిదండ్రులను పీల్చిపిప్పిజేస్తున్న పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని పాఠశాలలకు ఎటువంటి అనుమతులు లేకున్నా.. ఇంటర్నేషనల్ బోర్డులు తగిలించి.. కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. భవనానికి కూడా పర్మిషన్ లేకున్నా.. ఇష్టానుసారంగా పాఠశాల నిర్వహిస్తూ అడ్మిషన్లు కొనసాగిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ విద్యాశాఖ అధికారులు లంగర్ హౌజ్‌లోని 800 మంది విద్యార్థులు చదువుతున్న ఆర్చిడ్స్ స్కూల్‌కు అనుమతి లేదని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఏడాది వరకు కొనసాగినా.. అధికారులకు కనిపించని స్కూల్ చివర్లో మాత్రం రద్దు చేయడంపై విమర్శలొచ్చాయి. విద్యార్థులు సైతం చివర్లో వేరే స్కూల్లో ప్రవేశానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా చందానగర్‌లోని రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నిబంధనలకు పాతరేసి అడ్మిషన్ల దందా చేస్తున్నది. భవనానికి గాని.. స్కూల్‌కు ఎటువంటి అనుమతులు లేకున్నా పాఠశాల నిర్వహిస్తుండటం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. ఈ తరహాలోనే గ్రేటర్లో చాలా పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయంటూ విద్యార్థి సంఘాల నాయకులు విద్యాశాఖకు ఫిర్యాదులు చేశారు.
అనుమతులు లేకున్నా అడ్మిషన్లు తీసుకుంటూ రిడ్జ్ బోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో కౌంటర్ తెరిచారు. చందానగర్ సర్కిల్ 21లోని సురక్ష ఎన్క్లేవ్ కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న భవనంలో స్కూల్‌కు అనుమతులు రాకముందే అడ్మిషన్ల దందా మొదలుపెట్టారు. జీహెచ్ంఎసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం రెసిడెన్షియల్ నిర్మాణంలో కమర్షియల్ కార్యాకలాపాలు ఎలా కొనసాగిస్తారంటూ నోటీసులు జారీ చేశారు. కానీ సదరు నిర్మాణదారులు, స్కూల్ యాజమాన్యం తమకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ దర్జాగా పాఠశాల నిర్వహిస్తున్నారు.
కమర్షియల్ అనుమతులకు భారీ మొత్తంలో ఫీజు చెల్లించాల్సి వస్తున్నదని, రెసిడెన్షియల్ అనుమతులైతే తక్కువ ఖర్చుతోనే పనవుతుందని అధికారులే వెనకాల ఉండి నిర్మాణదారులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ సొంత లాభాలను చూసుకొని జీహెచ్ంఎసీ ఆదాయానికి భారీ మొత్తంలో గండి పెడుతున్నారు. గృహ సముదాయ భవనంలో పాఠశాల నిర్వహణకు అనుమతులు ఉండవు. కాగా, అనుమతులు లేకుండా రెసిడెన్షియల్ భవనంలో స్కూల్ నిర్వహణకు పూనుకున్న భవన యాజమాన్యానికి నోటీసులు అందజేశామని అధికారులు తెలిపారు.
ఒక్క రిడ్జ్ స్కూలే కాదు.. గ్రేటర్‌లోని చాలా పాఠశాలలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయి. వచ్చే విద్యా ఏడాదికి ఇప్పటికే 80 శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయి. కనీసం నోటీసు బోర్డుపై ఏ క్లాస్‌కు ఎంత ఫీజు వసూలు చేస్తామో కూడా తెలపకుండా వారికి నచ్చినట్టుగా ఫీజులు వాళ్లే నిర్ణయించేస్తున్నారు. గ్రేటర్‌లోని పాఠశాలల్లో ఎల్కేజీకి వసూలు చేస్తున్న ఫీజులు.. ఇంజినీరింగ్, మెడిసిన్, డెంటల్ కాలేజీలు ఫీజుల కన్నా అధికంగా ఉన్నాయి. ఇంజినీరింగ్‌లో గరిష్ఠంగా అధికంగా రూ.2.15 లక్షల ఫీజు ఉంటే.. ఓ పాఠశాలలో ప్రీ ప్రైమరీకి రూ.2.10 లక్షలు వసూలు చేశారు. ఫీజుల కట్టడిపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎలాంటి నియంత్రణ ఉండకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
అంతర్జాతీయ ప్రమాణాలు అని చెప్పుకుంటున్న పాఠశాలల్లో ప్రమాణాలు సాధారణ పాఠశాలల మాదిరిగానే ఉంటున్నాయని విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ బోర్డు తగిలించుకున్న పాఠశాలలు ఎల్కేజీకి రూ.1.25లక్షలకు వసూలు చేస్తున్నాయి. అయితే హైదరాబాద్ పరిధిలో ఒకటో తరగతి నుంచి 10 వ తరగతి వరకు 773 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. మరో 3,500 వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. చాలా విద్యాసంస్థలు ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరుతో రాజ్యమేలుతున్నాయి.
ఎలాంటి అనుమతులు లేకున్నా దర్జాగా బోర్డులు తగిలించుకొని దందా చేస్తున్నాయి. సీఐఎస్(కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్) గుర్తింపు ఉన్న పాఠశాలలు మాత్రమే ఇంటర్నేషనల్ బోర్డులు తగిలించుకోవాలి. ఈ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న పాఠశాలలను ఆ సంస్థ అన్ని విధాలుగా పరిశీలించి ఆమోదం తెలుపుతుంది. గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, బోధన సామగ్రిలాంటి 25 అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రేడింగ్స్ జారీ చేస్తుంది. కానీ నగరంలోని చాలా పాఠశాలలు గుర్తింపులేకున్నా ట్యాగ్ తగలించుకుంటున్నాయి.
పాఠశాల స్థాపించాలంటే విద్యాశాఖ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మద్యం దుకాణాలు, ప్రార్థన మందిరాలకు పాఠశాలు దూరంగా ఉండాలి. 24 శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) తీసుకోవాలి. భవన రిజిస్ట్రేషన్, అగ్ని మాపకం తప్పనిసరి. అయితే నగరంలో చాలా పాఠశాలలను కేవలం లాభార్జన మీదనే నెలకొల్పుతున్నారు. డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ కోర్సులను పూర్తి చేయని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుని పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారని ఫిర్యాదులు అందినా డీఈవోలు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయం విద్యా శాఖాధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.