హిమాయత్ నగర్, మార్చి3: ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీలు, మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, సీఎల్ సీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఎన్.నారాయణరావు డిమాండ్ చేశారు. హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రకృతి, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్ని 2024 జనవరి నుంచి ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్లు చేస్తూ అమాయక ఆదివాసీలు, కార్యకర్తల ప్రాణాలను తీసిందని ఆరోపించారు. ఈ ఘటనలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని సూచించారు.
14 నెలల కాలంలో 434 మందిని కేంద్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని వారు ఆరోపించారు. మూలవాసీ బచావో మంచ్ నేతలు రఘు, గజేంద్ర, లక్ష్మణ్‌ను గత నెల 27వ తేదీన రాయపూర్ లో ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేశారని వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలోని ప్రతి మనిషి జీవించే హక్కు ఉందని ఆ హక్కును కాలరాసేందుకు డబుల్ ఇంజన్ సర్కార్‌గా ప్రకటించుకున్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటు చేసిన పోలీసు క్యాంపులను ఎత్తివేసి అక్కడ ప్రజలు స్వేచ్ఛగా జీవించే వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వేదిక నేతలు ఎం.రాజు, రాంబాబు పాల్గొన్నారు.