అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు
సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా ఉన్న మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా నగరానికి తూర్పు వైపు ఉన్న నాగోల్, ఉప్పల్ ప్రాంతాల నుంచి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్‌కు చేరుకునేందుకు అత్యంత సులభమైన మార్గం మెట్రోనే. ఈ నేపథ్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు తమ వాహనాలను స్టేషన్లో పార్కింగ్ చేస్తున్నారు. పెరుగుతున్న వాహనాలను దృష్టిలో పెట్టుకొని మెట్రో కారిడార్-3లో ప్రారంభ మెట్రో స్టేషన్ అయిన నాగోల్‌లో వాహనాల కోసం అత్యాధునికంగా తీర్చిదిద్దిన పార్కింగ్ స్థలాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు తెలిపారు. ఇప్పటికే ద్విచక్ర వాహనాలు, కార్ల పార్కింగ్‌కు స్థలం ఉంది.
అదనంగా మరిన్ని వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఉప్పల్ మెట్రో డిపో, కమాండ్ కంట్రోల్ సెంటర్ పక్కన ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకేసారి 600లకు పైగా పలు రకాల వాహనాలను పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. నాగోల్ నుంచి హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్లకు చేరుకునేందుకు 50 నుంచి 55 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండటంతో ఉప్పల్, నాగోల్, రామంతాపూర్ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు మెట్రోను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.