బంజారాహిల్స్, జూన్ 10: నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో కలిసి జరుపుకున్నారు. వారితో కలిసి కేక్ కట్ చేయడంతో పాటు వారికి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజుల్లో డాక్టర్ కావాలని తన తండ్రి ఎన్టీఆర్ కోరుకున్నా సాధ్యం కాలేదని, అయితే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి బాధ్యతలు చేపట్టడం ద్వారా తండ్రి కోరికతో పాటు తల్లి ఆశయాన్ని నెరవేర్చే అవకాశం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడు జేఎస్ఆర్ ప్రసాద్, సీఈవో డా.కృష్ణయ్య, మెడికల్ సూపరింటెండెంట్ డా.ఫణి కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.