సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ) : బంజారాహిల్స్ రోడ్ నం. 12, ఎన్బీటీ నగర్లోని జీహెచ్ఎంసీ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న కొంత మంది వ్యక్తులు తన పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మండిపడ్డారు. రెండు రోజుల కిందట ఎన్బీటీ నగర్లో పెండింగ్ పనులను పరిశీలించేందుకు జోనల్ కమిషనర్ వెంకటేశ్, డీఎంసీ ప్రశాంతితో పాటు అధికారులతో కలిసి తాను పర్యటించిన సమయంలో కొంతమంది వ్యక్తులు తనతో పాటు అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. అక్కడున్న ప్రభుత్వ స్థలాన్ని సుమారు ఆరేండ్ల క్రితమే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కేటాయించడంతో పాటు రూ. 2 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు మేయర్ వివరించారు.
సీఎం కేసీఆర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, నిర్మాణ పనులను జీహెచ్ఎంసీకి అప్పగించారని గుర్తు చేశారు. సదరు స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించడంతో పాటు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. వారి ఆగడాలను బస్తీ వాసులతో పాటు అధికారులు గతంలోనే అడ్డుకున్నారని, ఆక్రమణలు తొలగించడంతో పాటు ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేశామని మేయర్ పేర్కొన్నారు. వాస్తవాలను గుర్తించకుండా కొందరు వ్యక్తులు తన పై సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మేయర్ ఆరోపించారు. కొంత మంది దురుద్దేశంతోనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ స్థలాన్ని ఆక్రమిస్తే సహించేది లేదని మేయర్ హెచ్చరించారు.