జూబ్లీహిల్స్,జనవరి21: ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పంచే పార్కుల ఆధునీకరణపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించారు. యూసుఫ్‌గూడ సర్కిల్లోని అన్ని పార్కుల అభివృద్ధికి యూబీడీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాలనీ పార్కుల రక్షణకు కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు.. పార్కులలో అవసరమైన బెంచీల ఏర్పాటుతో పాటు పూర్తిస్థాయి ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్కులలో ఓపెన్ జిమ్‌లు, పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేయనున్నారు.
ఈ మేరకు కాలనీ పార్కులలో యూబీడీ అధికారులు ఇటీవల పూర్తిస్థాయి సర్వే నిర్వహించారు. ఆయా కాలనీ పార్కులలో వివిధ అభివృద్ధి పనులతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ 19 వ సర్కిల్ వెంగళరావునగర్ డివిజన్లో అత్యధికంగా 11 కాలనీ పార్కులుండగా ఎర్రగడ్డలో 4, యూసుఫ్‌గూడలో 3, రహ్మత్‌నగర్‌లో 2 పార్కులున్నాయి. కాగా ఈ కాలనీ పార్కులలో అవసరమైనంత స్థలం అందుబాటులో ఉంటే ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేయనున్నామని అధికారులు తెలిపారు.
యూసుఫ్‌గూడ సర్కిల్లో ఉన్న 20 కాలనీ పార్కులలో అర్బన్ బయోడైవర్సిటీ అధికారులు ఇటీవల సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా స్థలం అందుబాటులో ఉన్న పార్కులలో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రహ్మత్‌నగర్ డివిజన్ శ్రీరాంనగర్ కాలనీ పార్కులో యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ మహబూబ్ అలీతో కలిసి అభివృద్ధి పనుల ప్రతిపాదనలను పరిశీలించారు.
ప్రతిపాదనలు పరిశీలిస్తున్నాం
కాలనీ పార్కుల అభివృద్ధిపై అధికారులు చేసిన ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. పార్కులలో ఓపెన్ జిమ్‌లు.. పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేస్తాం. యూసుఫ్‌గూడ సర్కిల్ అధికారులు అన్ని పార్కులలో సర్వే నిర్వహించారు. ఆయా పార్కులలో సరిపడా స్థలం ఉంటే ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఏర్పాటు చేస్తాం. అధికారులు చేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తున్నాం.
-అనిల్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్,అర్బన్ బయోడైవర్సిటీ