సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని పలు సర్కిళ్లలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు చేపట్టింది విద్యుత్ శాఖ. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలో ఏడీఈ, ఏఈలకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా, సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని నార్సింగ్ సెక్షన్ కార్యాలయంలో పనిచేసే లైన్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. గ్రేటర్లోని 10 సర్కిళ్ల పరిధిలో పనిచేస్తున్న ఉన్నతస్థాయి అధికారుల నుంచి కింది స్థాయి వరకు ఉన్నవారిని బదిలీలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మాసబ్ ట్యాంక్ సమీపంలో చాచా నెహ్రూ పార్కు వద్ద ఉన్న 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లో సాంకేతిక కారణంతో సరఫరాలో అంతరాయం జరిగింది. అయితే దీన్ని సరిచేసేందుకు గంటల తరబడి తీసుకున్నారని పెద్ద ఎత్తు ఫిర్యాదులు వచ్చాయి.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ దీనిపై తగిన నివేదిక ఇచ్చి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ ఎస్ఈ మోహన్ రెడ్డిని ఆదేశించారు. విచారణ జరిపిన ఎస్ఈ విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు వివరణ ఇవ్వాల్సిందిగా మాసబ్ ట్యాంక్ అసిస్టెంట్ ఇంజినీర్ నాగచైతన్య, మెహిదీపట్నం డివిజినల్ ఇంజినీర్ మల్లయ్యకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నార్సింగ్ సెక్షన్ కార్యాలయం లైన్ ఇన్స్పెక్టర్(ఆపరేషన్స్) మనోహర్ సూర్తి బాబును సస్పెండ్ చేశారు.