Shamshabad | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 8: అభం శుభం తెలియని చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన బస్సు డ్రైవర్ జోసస్రెడ్డి తో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ ఆనంద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం శంషాబాద్ పట్టణంలోని ఇన్ఫాంట్ జీసస్ పాఠశాల ఎదుట తల్లిదండ్రులతో పాటు శంషాబాద్ పట్టణంలోని వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొదటి తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బస్సు డ్రైవర్ జోసప్రెడ్డితో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ ఆనంద్, బస్సు డ్రైవర్ భార్యను విధుల నుంచి తొలగించి చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మంచాల పోలీసులు సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయలేదని, వారిపై తమకు నమ్మకంలేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ సీఐ బాలరాజు ఆధ్వర్యంలో పలువురు పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొదటి తరగతి చదువుతున్న చిన్నారిపై ఇలాంటి చర్య జరిగితే మిగితా పిల్లల పరిస్థితి ఏమిటని నిలదీశారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా హామీ ఇవ్వాలని కోరారు. అనంతనం పాఠశాల నుంచి ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి సీఐ బాలరాజుకు మరోసారి ఫిర్యాదు చేశారు. ఆందోళన నిర్వహించిన వారిలో శంషాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండిగోపాల్, నాయకులు కొన్నమొల్ల శ్రీనివాస్, పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిందితులపై కఠిన చర్యలు
తీసుకుంటాం..: బాలరాజు, ఆర్జీఐఏ సీఐ
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మంచాల పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. శంషాబాద్ పట్టణంలో జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తాం. శంషాబాద్‌లోని ప్రైవేటు పాఠశాలలో యాజమాన్యం ప్రతి రోజు బస్సు డ్రైవర్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయడంతో పాటు ఏదైనా ఘటన జరిగితే ఆయా పాఠశాలల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.