సికింద్రాబాద్, ఫిబ్రవరి 4: సికింద్రాబాద్ అవినాష్ కాలేజీ ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, వెంటనే ఆ కాలేజీపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులు గొడవపడ్డ కారణంగా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న రాహుల్ అనే దళిత విద్యార్థిని బహిషరించి, రోడ్డుపైకి నెట్టడాన్ని నిరసిస్తూ.. మంగళవారం కాలేజీ ప్రధాన గేట్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలేజీ నుంచి బహిష్కరింపబడిన దళిత విద్యార్థికి న్యాయం చేసి, అవినాష్ కళాశాల అనుమతులను రద్దు చేయాలని అన్నారు. బౌన్సర్లతో కళాశాలను నడిపించడం ఇదెకడి సంస్కృతి అని, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేయడం దారుణమని అన్నారు.
దళిత విద్యార్థినిని చీకటి గదిలోవేసి కొట్టి రోడ్డు మీద పడేసిన అవినాష్ కళాశాల చైర్మన్ అవినాష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అవినాష్ కాలేజీపై చర్యలు తీసుకోవాలని లేనిచో తమ పోరాటం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాటారు దశరథ్, రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, హైదరాబాద్ అధ్యక్షుడు యాద క్రాంతి, చంద్రకాంత్, ఓయూ నాయకులు నాగేందర్ కోదాటి, అద్వితి రెడ్డి, రాకేశ్, కల్లూరి సాయి, సంజు, నిజాం కళాశాల అధ్యక్షులు రాకేశ్, హేమ వర్ధన్, అభి ముదిరాజ్, శివ, రాజు, సిసిందర్ మనోజ్, వేణుమాధవ్, చింటూ, మహేశ్, ప్రశాంత్, వివేక్, తదితరులు పాల్గొన్నారు.