Bandlaguda | బండ్లగూడ, మే 28 : రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా ఉంది బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు అని స్థానికులు విమర్శిస్తున్నారు.. ప్రత్యేక అధికారులు పాలనలో అధికారులు తమ ఇష్టాననుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకున్నా ఏసీలు, ఫ్యాన్లను వేసి కరెంటును వృథా చేస్తున్నారు. గత నాలుగు నెలల క్రితం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సుమారు 12 కోట్ల రూపాయలతో అన్ని హంగులతో నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది. అన్ని సౌకర్యాలు ఉండటంతో వాటన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నారు. అధికారుల రూమ్‌ల్లో ఉన్న ఫ్యాన్లు, ఏసీలను ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచుతున్నారు. గదుల్లో అధికారులు లేని సమయాల్లో కూడా ఏసీలు, ఫ్యాన్లను ఆఫ్ చేయకుండానే ఉంచేస్తున్నారు. దీంతో విద్యుత్ బిల్లులు తడిచిమోపెడవుతున్నాయి. అయినప్పటికీ మున్సిపల్ కమిషనర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.