మాదాపూర్, మే 11 : జల్సాలకు అలవాటు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ రఘునందన్‌రావు, మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, క్రైం ఇన్స్పెక్టర్ వెంకట్, ఎస్సైలు రవి కిరణ్, అవినాశ్‌లతో కలిసి మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, క్రైం ఇన్స్పెక్టర్ వెంకట్లు రెండు బృందాలుగా బస్‌స్టాప్‌లలో చైన్ స్నాచింగ్‌లపై నిఘా పెట్టారు. గురువారం సీడీఐ చౌరస్తా వద్ద ఉన్న బస్‌స్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న కాంబ్లే లక్ష్మణ్ (33), వేముల శ్రీనివాస్ (42)ను అదుపులోకి తీసుకుని విచారించారు. తాము రద్దీ బస్సుల్లో బంగారు చైన్లను దొంగిలిస్తామని వారు అంగీకరించారు.
తమతో పాటు రత్నదీప్ మార్కెట్ వద్ద మరికొంత మంది ఉన్నట్లు తెలిపారు. దీంతో మాదాపూర్ డీఐ వెంకట్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకోగా అనుమానాస్పదంగా తిరుగుతున్న లండె నాగేశ్ (45), ధర్మేందర్ (32), కాంబ్లే అనిల్ (34), ఆర్. రాహుల్ (22), కాంబ్లే హీరా (25), వడ్డెర ప్రసాద్ (24), యు. రమేశ్ (38)లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో రద్దీగా ఉండే బస్సుల్లో చైన్ స్నాచింగ్‌లు చేసినట్లు అంగీకరించారు. వీరి నుంచి రూ. 6లక్షల విలువైన బంగారు గొలుసులు 9, మూడు స్మార్ట్ ఫోన్లు, కీ ప్యాడ్ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తొమ్మిది మందిని కోర్టులో హాజరుపరుచగా, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు డీసీపీ శిల్పవల్లి తెలిపారు. గతంలో వీరిపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో 9 కేసులు, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో 1, రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 2, హుమాయున్ నగర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక్కో కేసు చొప్పున ఉన్నట్లు తెలిపారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, క్రైం ఇన్స్పెక్టర్ వెంకట్‌తో పాటు సిబ్బందిని డీసీపీ శిల్పవల్లి అభినందించారు.
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు
ఆన్లైన్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న నిందితులను గురువారం మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ శిల్పవల్లి, ఇన్స్పెక్టర్ తిరుపతి, ఏసీపీ రఘునందన్‌రావు, క్రైం డీఐ వెంకట్, ఎస్సై రవికిరణ్‌తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. పర్వత్‌నగర్‌లోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి నాగల్ల వెంకన్న (33)ను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన నక్కల నాగేశ్వర్రావు (41), పాములపాటి రవిచంద్ (33)ల సూచనల మేరకు బెట్టింగ్ నిర్వహించినట్లు పోలీసులకు వెంకన్న తెలిపాడు. ఈ మేరకు రాయదుర్గంలోని హోం ఉడ్స్ హోటల్లో మిగతా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా బోస్ అలియాస్ సుభాష్ చంద్రబోస్ సూచనతో బెట్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో నిందితుల నుంచి రూ. 2.60 లక్షలు, కాన్ఫిరెన్స్ బాక్స్, ల్యాప్‌టాప్‌లు 2, మొబైల్ ఫోన్లు 5ను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, ఎస్సై రవికిరణ్ బృందాన్ని డీసీపీ శిల్పవల్లి అభినందించారు.