Hyderabad | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : నల్లకుంట పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన ఓ మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితుడు రాజనాల రమేష్ అలియాస్ వెంకటేష్‌కు 25 ఏండ్ల జైలు శిక్షతోపాటు 5వేల జరిమానా విధిస్తూ పోక్సోకోర్టు జడ్జి టి.అనిత శుక్రవారం తీర్పు వెల్లడించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరునెలల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బాలికకు 7లక్షల నష్టపరిహారం అందించాలని న్యాయ సేవాధికార సంస్థకు సూచించారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్‌రెడ్డి కథనం ప్రకారం కాచిగూడ బస్టాప్ పక్కన నివసిస్తున్న బాలికను కిడ్నాప్ చేసి రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న స్ట్రీట్ నెం.4 ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడినట్టు ఫిర్యాదుదారుడి సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక అరుపులకు సదరుప్రాంతానికి చేరుకున్న ఫిర్యాదుదారుడు 100 డయల్ చేయడంతో ఘటనాస్థలానికి చేరుకునే సమయానికి నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారించి రిమాండ్‌కు తరలించారు. అనంతరం పోలీసులు పూర్తి సమాచారంతో విచారణాధికారి మొగలిచర్ల రవి చార్జీషీట్ దాఖలు చేశారు. 2023నుంచి సుధీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు నిందితుడు నేరం చేసినట్టు రుజువు కావడంతో శిక్షను ఖరారు చేశారు. ఈ కేసుకు సహకరించిన టి.కల్పన లీగల్ సపోర్టు ఆఫీసర్, అధికారి బి.జగదీశ్వర్రావులను అభినందించారు.