శంషాబాద్ రూరల్, నవంబర్ 10: విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తిని ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి కథనం ప్రకారం.. జూకల్ గ్రామంలో శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో గ్రామంలోని చౌడమ్మ దేవత కుడి కన్ను ధ్వంసం చేయడంతో పాటు అమ్మవారిని అలంకరించిన చీర, పక్కనే ఉన్న సోమన్న గుడిలో స్వామి వారికి అలంకరించిన పంచెను నిందితుడు ధ్వంసం చేశాడు. పూజారి కుమ్మరి కృష్ణ వెంటనే అక్కడికి చేరుకోవడంతో పాటు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు.
నిందితుడు మహారాష్ట్రకు చెందిన సలీం ఆర్మన్ తాడ్విగా గుర్తించారు. నిందితుడిపై మహారాష్ట్రలో కేసులు ఉన్నాయని, ఆ కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లాడని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్కు వచ్చినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. తాజాగా, జూకల్ గ్రామ పరిధిలోని ఆలయంలో విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. జూకల్ ప్రాంతాన్ని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఆదివారం సందర్శించి, శాంతిభద్రతలను పర్యవేక్షించారు. శంషాబాద్ పరిధిలో జరుగుతున్న వరుస ఘటనలపై సీపీ ఆరా తీయడమే కాకుండా.. ఒక దశలో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలీసులు గస్తీ పెంచి, అసాంఘిక శక్తులపై నిఘా పెట్టాలని ఆదేశించారు.