సిటీబ్యూరో, మే 22(నమస్తే తెలంగాణ):అధిక రాబడి పేరుతో అమాయకుల నుంచి రూ.4.48కోట్లు వసూలు చేసి పరారైన వ్యక్తిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. డీసీపీ ప్రసాద్ కథనం ప్రకారం.. సికింద్రాబాద్కు చెందిన జితేందర్ చౌబే వృత్తిరీత్యా మిలటరీ కాలేజ్లో ఎలక్ట్రీషియన్. 2018లో పదవీ విరమణ పొంది బొల్లారంలో నివాసముంటూ ఎక్స్సర్వీస్మెన్గా స్థానికులతో పరిచయాలు పెంచుకుని వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు.
జేకే ఎంటర్ప్రైజెస్, సౌమ్యశ్రీ హాస్పిటల్, కార్తీక్ లాజిస్టిక్స్ అనే పేర్లతో అల్వాల్లో పలు సంస్థలను ప్రారంభించాడు. ఎవరైనా పెట్టుబడులు పెడితే వారికి ప్రతి నెలా 5 శాతం రాబడి చెల్లిస్తానంటూ నమ్మబలికాడు. నిఈ క్రమంలో నిందితుడు అమాయక ప్రజల నుంచి రూ.4.48కోట్లు వసూలు చేసి కొన్ని నెలల వరకు సాఫీగానే రాబడి చెల్లించాడు. కాగా గత సంవత్సరం డిసెంబర్లో కంపెనీ బోర్డు తిప్పేసి బాధితులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో రూ.2లక్షల వరకు పెట్టుబడి పెట్టిన చంద్రావతి దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఈఓడబ్ల్యూ పోలీసులు నిందితుడిని ఢిల్లీలో అరెస్టు చేశారు.