సిటీబ్యూరో, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధికలాభాలు ఎలా వస్తాయో సలహాలు చెప్పి లాభాల ఆశచూపి పెట్టుబడులు పెట్టించి లక్షల రూపాయలు కొట్టేసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాకు చెందిన శివశంకర్ అనే డేటాఎంట్రీ ఆపరేటర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్‌చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు కేసు నమోదుచేసుకుని నిందితుడిని పట్టుకున్నారు.
బాధితుడికి ఒక నెంబర్ నుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందని, అందులో ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు అర్జించడానికి కావలసిన సలహాలు చెబుతామని, ఇందుకోసం తాము పంపిన లింక్ క్లిక్ చేసి వాట్సప్ గ్రూపులో జాయిన్ అయి పెట్టుబడులు పెట్టాలని సైబర్ నేరగాళ్లు సూచించారు. ఇన్స్టిట్యూషనల్ స్టాక్స్, ఓటీసీ స్టాక్స్, శామ్కో గ్రూప్ స్టాక్స్‌లో పెట్టుబడులుపెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మించారు.
దీంతో బాధితుడు వారి మాటలు నమ్మి ఆ గ్రూపులో చేరి పెట్టుబడుల రూపంలో రూ.14,63,046లు తన అకౌంట్నుంచి వివిధ అకౌంట్లకు పంపాడు. ఆ తర్వాత లాభాలు చూపించడంతో విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే అవి కావాలంటే మరిన్ని డబ్బులు పెట్టుబడి పెట్టాలంటూ చెప్పారని, ఆ తర్వాత వారిని సంప్రదించాలని ప్రయత్నిస్తే స్పందించలేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని పట్టుకుని అతని వద్ద రెండు సెల్ఫోన్లు, నాలుగు చెక్‌బుక్స్, 2 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దేశవ్యాప్తంగా రెండు నేరాల్లో నిందితుడుగా ఉన్నాడని, అందులో ఒకటి తెలంగాణలో ఉందని వారు తెలిపారు.