బేగంపేట్, సెప్టెంబర్ 11: పార్కింగ్ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్న కరుడుగట్టిన దొంగను, ఇద్దరు బైక్ రీసివర్లను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. 59 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకొని.. నిందితులను రిమాండ్‌కు తరలించారు. బుధవారం బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తర మండలం డీసీపీ సాధన రష్మీ ఇన్స్పెక్టర్ రామయ్యతో కలిసి వివరాలు వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం మంచుకుంటినగర్కు చెందిన రాయుడు చైతన్యసాయికుమార్ 2013లో పాల్వంచ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చదువుతూ.. మధ్యలోనే మానేశాడు. జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి వివిధ ప్రైవేట్ సంస్థల్లో పనిచేశాడు. జల్సాలకు, వ్యసనాలకు అలవాటు పడిన సాయికుమార్ ఎక్కడా సరిగ్గా పని చేసే వాడు కాదు. దీంతో యజమానులు తొలగిస్తుండే వారు. ఈ క్రమంలో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ద్విచక్రవాహనాలు దొంగిలించడం ప్రారంభించాడు. ఒంటరిగా వెళ్తూ.. మెట్రో పార్కింగ్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద పార్కింగ్ స్థలాల్లో ద్విచక్ర వాహనాలను హ్యాండీల్ లాక్‌ను చేతితో విరగొట్టి మారు తాళంతో వాహనాలను దొంగిలిస్తున్నాడు.
ఆ వాహనాలను వెంటనే విక్రయించకుండా దూరంగా ఉన్న మరో పార్కింగ్ స్థలంలో పెట్టేవాడు. అలా పెట్టిన వివరాలను రిసీవర్లకు చెప్పి.. బైక్ అవసరం ఎవరికీ ఉందో తెలుసుకునే వాడు. వాహనం అమ్మే సమయంలో తాను దాచిన పార్కింగ్ స్థలం నుంచి వాహనాన్ని తీసుకుపోయి విక్రయించేవాడు. ఇలా గతంలో ఉప్పల్, చౌటుప్పల్, మాదాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలో 27 ద్విచక్రవాహనాలను దొంగలించాడు. ఈ కేసుల్లో ఉప్పల్ పోలీసులు సాయికుమార్‌ను అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు.
మూడు నెలల కిందట జైలు నుంచి వచ్చిన సాయికుమార్.. తన పద్ధతిని మార్చుకోకుండా తిరిగి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 17, సైబరాబాద్ పరిధిలో 18, రాచకొండ పరిధిలో 19 వాహనాలను చోరీ చేశాడు. ఓ చోరీ కేసు వివరాలను సీసీ ఫుటేజీలో బేగంపేట పోలీసులు పరిశీలిస్తుండగా, సాయికుమార్ బైక్ దొంగలిస్తూ కనిపించాడు. అతడి నేర చరిత్ర ఆధారంగా పట్టుకున్నారు. సాయికుమార్‌తో పాటు ఇద్దరు రిసీవర్లు జగదీష్, కుంచాల హరికృష్ణను కూడా అరెస్టు చేశారు.