వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 17: ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాల రూపకల్పన జరిగినదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అగ్రి యూనివర్సిటీ కళాశాలలో గురువారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మలి విడత తెలంగాణ ఉద్యమ ఫలితంతో రాష్ట్రంలో అనతి కాలంలోనే విప్లవాత్మక మార్పు సంభవించినదని, ప్రధానంగా వ్యవసాయం మార్పులో మనందరి కృషి ఉందన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలతో పాటు, వ్యవసాయ రంగానికి ప్రత్యక్ష, పరోక్షంగా సహకరించడం వల్లే సాధ్యమైనదన్నారు. రాష్ట్రంలో సాగునీటి వసతి పెరగడంతో వరి విస్తీర్ణం ఘనణీయంగా పెరిగిందన్నారు. పప్పు దినుసులు, నూనె గింజల సాగు పైనా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన మలి దశ ఉద్యమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు, బోధనా బోధనేతర సిబ్బంది కీలక పాత్ర ఉన్నదన్నారు. విశ్వ విద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, హెల్త్ కార్డుల పంపిణీ, 2016 పీఆర్సీ, ఏరియర్స్ విడుదల దశల వారీగా జరుగుతున్న అభివృద్ధిలో పలు సమస్యలపై సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో చర్చిస్తామన్నారు. సాగునీటి వసతి, విద్యుత్ మిషన్ కాకతీయ వంటి బృహత్తర కార్యక్రమాలు వల్లే నేడు దేశానికి సైతం తిండి గింజలు అందించగల్గుతున్నామన్నారు. తెలంగాణ అగ్రికల్చర్ సైంటిస్ట్ అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ కేరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం పదోన్నతులు, ఏరియర్స్ విడుదల తదితర అంశాల పట్ల సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ముజీబ్, పలువురు విద్యార్థులు పాల్గొని చర్చించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు డా.రజినీ శ్రీకాంత్, శ్రీనివాస్ యాదవ్, అమృత్ రెడ్డి, డాక్టర్ చిన్నా నాయక్, డా.సాయి కుమార్, సంపత్ పాల్గొని పలు సూచనలు చేశారు.