సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రజా పాలనకు గ్రేటర్ సిద్ధమైంది. గురువారం నుంచి జనవరి 6 వరకు (డిసెంబర్ 31, జనవరి 1 మినహా) గ్రేటర్లో 150 వార్డులలో 600 సెంటర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రతి వార్డులో నాలుగు ముఖ్య ప్రాంతాలను ఎంపిక చేసి నాలుగు టీంలను ఏర్పాటు చేశారు. టీం లీడర్‌తో కలిసి మొత్తం 8 మంది ఉంటారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు షిప్టుల వారీగా దరఖాస్తులను స్వీకరించనున్నారు. మొత్తం 4800 మంది ప్రజాపాలన విధుల్లో పాల్గొంటుండగా..దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. స్వయం సహాయక బృందాలతో దరఖాస్తు ఫారాలను అందజేసి, దరఖాస్తులు సమర్పించిన అనంతరం దరఖాస్తుదారుడికి రసీదును ఇవ్వనున్నారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు నోడల్ ఆఫీసర్లుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ. శ్రీధర్, కె. నిర్మలను నియమించారు. ప్రజా పాలన మొదటి రోజు కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బంజారాహిల్స్ డివిజన్లో ప్రారంభించనున్నారు.
జోన్ల వారీగా పర్యవేక్షణ అధికారులు వీరే